అనకాపల్లి (గొలుగొండ), జూన్ 2 : యోగా సాధనతో ఆరోగ్యం బాగుంటుందని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సోమవారం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో గల అల్లూరి సీతారామరాజు పార్క్ లో ఏర్పాటు చేసిన మెగా యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నాలుగు మెగా ఈవెంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్క్ లో యోగ సాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. యోగ మన సమగ్ర జీవన విధానమని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన సాధనమని తెలిపారు.
జిల్లాలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారు మండలాల్లో, గ్రామాల్లో యోగ శిక్షణ అందిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజలకు యోగా శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని, యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. మన ఆరోగ్యం కోసం రుషులు రూపొందించిన యోగా సాధనాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. శారీరక ఇబ్బందులు కలవారు కూడా సాధన చేయుటకు అనుగుణంగా యోగాసనాలు రూపొందించడం జరిగిందని, వారి శరీరానికి అనువైన యోగాసనాలు ప్రతి ఒక్కరూ సాధన చేయాలన్నారు. యోగా సాధనతో మధుమేహం వంటి వ్యాధులు నియంత్రణలో ఉంచుకోవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి వీవీ రమణ, జిల్లా టూరిజం అధికారి కే మనోరమ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కే లావణ్య, తహసీల్దారు ఎల్బీ రామారావు, ఎంపీడీవో, ఇతర అధికారులు, సిబ్బంది, మాస్టర్ ట్రైనర్లు, యోగా సాధకులు పాల్గొన్నారు.