హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి ఈ సంవత్సరం భక్తులకు విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్‌లో జరిగే మహాగణపతి 71వ వేడుకలకు నిర్జల ఏకాదశి సందర్భంగా కర్ర పూజ (తొలిపూజ) జరిగింది. ఈ పూజతో, ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా, నిర్వాహకులు ఈ సంవత్సరం గణేశ విగ్రహం యొక్క నమూనా చిత్రాన్ని విడుదల చేశారు. ఉత్సవ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం, ఈసారి ఖైరతాబాద్‌లో 69 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మట్టి విగ్రహాన్నే సిద్ధం చేస్తున్నారు. ఇది భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ ప్రారంభ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు.