హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి, ఓపీలో ఉన్న పేషెంట్లతో మంత్రి మాట్లాడారు. ట్రీట్‌మెంట్, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డాక్టర్ల అటెండెన్స్ షీట్ తెప్పించుకుని మంత్రి పరిశీలించారు. అందులో భాగంగా ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఓపీలో అందుబాటులో లేని వైద్యనిపుణులు
మరోవైపు ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్, డీఎంఈని మంత్రి ఆదేశించారు. అదే క్రమంలో ఓపీ, ఐపీ, ఎంసీహెచ్, ఐవీఎఫ్, ఓపీ డయాగ్నస్టిక్ సర్వీసెస్, స్కానింగ్ వార్డులను మంత్రి పరిశీలించారు. ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై మంత్రి సీరియస్ అయ్యారు. సంబంధిత డాక్టర్లకు షోకాజ్ ఇవ్వాలని డీఎంఈకి ఆదేశాలు ఇచ్చారు.