మున్సిప‌ల్ మీటింగ్‌లో ర‌సాభాస‌..

నల్గొండ, ఆంధ్రప్రభ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం సోమవారం వాగ్వాదాలతో రసాభాసగా మారింది. రెండో డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య తన వార్డులోని సమస్యలను బ్యానర్ ద్వారా ప్రదర్శిస్తూ వాటి పరిష్కారం కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో 15వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్ కూడా అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంలో వైఫల్యం ఉందని వ్యాఖ్యానించడంతో చర్చ మరింత వేడెక్కింది.

ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ దూషణలకు దిగడంతో సుమారు పది నిమిషాల పాటు సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే ఇతర కార్పొరేటర్లు, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ, పాలకవర్గం ఏర్పడి ఐదు నెలలు గడిచినా అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని సమావేశంలో నిలదీశారు.