కర్నూలు బ్యూరో, మే 18, ఆంధ్రప్రభ : హార్ట్ అటాక్ విషయంలో గోల్డెన్ ఆవర్ ఎంతో ముఖ్యమని, వైద్యుల స్కిల్స్ ను అప్డేట్ చేసేందుకే నిరంతర శిక్షణలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ, జిజిహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూల్ మెడికల్ కాలేజీలో అనస్థీషియా విభాగం ఆధ్వర్యంలో పీజీ వైద్యులకు నిన్న, ఇవాళ రెండు రోజుల కాంప్రహెన్సివ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈకార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ… హార్ట్ ఎటాక్ విషయంలో గోల్డెన్ ఆవర్ చాలా ముఖ్యమని, ఎంత తొందరగా రోగికి వైద్యం ప్రారంభిస్తే అంత మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. అందువల్లనే ఈ అంశంపై నూతనంగా వస్తున్న మెలకువలను వైద్యులకు నేర్పించడం వలన స్పష్టంగా, ఖచ్చితమైన రోగనిర్ధారణ ద్వారా రోగులకు సత్వర వైద్యం అందించడం ద్వారా హార్ట్ ఎటాక్ నుంచి కాపాడవచ్చునని, అందుకే ఈ అంశంలో పి.జి లకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ప్రజలకు గుండెనొప్పి విషయంలో అనేక అపోహలున్నాయని, అత్యవసర సమయంలో సమయం వృధా కాకుండా వైద్యులు చికిత్సకు ఉపకరించేందుకు వారికి మెలకువలు నేర్పించడం ద్వారా రోగులకు స్వత్వర వైద్య సహాయం అంది, ప్రాణాలు కాపాడడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డా.శ్రీరాములు, అనస్తిషియా విభాగాధిపతి డా. వైశాల, ప్రొఫెసర్ సుదీర్ కుమార్, ప్రొఫెసర్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ డా.రామ్ శివ నాయక్, కోర్స్ కోఆర్డినేటర్ డా.రాణి మంజూషా, 44మంది పి.జి వైద్యులు ఈ శిక్షణ లో పాల్గొన్నారు.
