Condolence – మాగంటి మృతికి చంద్రబాబు, రేవంత్, పవన్ సంతాపం

హైదరాబాద్ : : బీఆర్ఎస్ సీనియర్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని అన్నారు. గోపీనాథ్ రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైందని, ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా పని చేశారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం..

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, మాగంటి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పవన్ కల్యాణ్ సంతాపం

బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ నియోజకవర్గం శాసన సభ్యుడు, సినీ నిర్మాత మాగంటి గోపీనాథ్ కన్నుమూశారని తెలిసి చింతించానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించానని తెలిపారు. మాగంటి కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు లోనై, ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందని.. కోలుకుంటారని భావించానని అన్నారు. 2014 నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ నియోజకవర్గం అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారని కొనియాడారు. మాగంటి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు

ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపు..

ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. గోపినాథ్ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మాగంటి కింది స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అని.. ఎమ్మెల్యేగా ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియజేశారు.

తీవ్ర విచారం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గోపీనాథ్ గుండెపోటుతో కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల తలలో నాలుకగా మారారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. మాగంటి కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కిషన్ రెడ్డి ప్రకటించారు.

మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి…

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ.. మాగంటి కుటుంబం మనో నిబ్బరంతో ఉండాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మాగంటి చాలా నిరాడంబరుడని, వివాద రహితుడని పేర్కొన్నారు.

సబితా ఇంద్రారెడ్డి సంతాపం

మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని.. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంట్లో మాట్లాడుతూ పడిపోయారని మాగంటి భార్య చెబితే తట్టుకోవడం కష్టమైందన్నారు. కార్యకర్తలను నిత్యం అందుబాటులో ఉండేవారని, కాలనీ సంక్షేమ సంఘాలకు పెద్ద దిక్కుగా ఉండేవారని, ఆయన అహం చూపించకుండా బతికారని, మాగంటి లేని లోటు తట్టుకునే శక్తిని ఆ దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

మంచి మిత్రుడిని కోల్పోయా.. దానం నాగేందర్

మాగంటి గోపీనాథ్‌తో 30 సంవత్సరాలుగా అనుబంధం ఉందని, మంచి మిత్రుడిని కోల్పోవడం బాధగా ఉందని ఎంఎల్ఏ దానం నాగేందర్ అన్నారు. సౌమ్యుడిగా వివాద రహితుడిగా మాగంటి కొనసాగారని.. నిత్యం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి అని.. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. మాగంటి కుటుంబం మనో నిబ్బరంతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. రకరకాల సమస్యలు ఆయనను చాలా బాధ పెట్టాయని దానం నాగేందర్ అన్నారు

Leave a Reply