కర్నూలులో అర్ధరాత్రి రక్తపాతం..

కర్నూలులో అర్ధరాత్రి రక్తపాతం..
పాత బస్టాండ్ బారు వద్ద ఘర్షణ..
కండేరు వద్ద కత్తిపోటు.. మనోహర్ అనే యువకుడు మృతి..
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..
పోలీసులకు లొంగిపోయిన నిందితుడు..
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగరంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న దారుణ హత్య సంఘటన తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ క్షణాల్లోనే రక్తపాతానికి దారితీసి ఒక యువకుడి ప్రాణాలను బలిగొనగా, మరి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. నగరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఓ బారు వద్ద మనోహర్‌కు వీరన్న అనే వ్యక్తితో వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో జరిగిన ఈ ఘర్షణ కొద్దిసేపటికి ఆగినట్లు కనిపించినప్పటికీ.. అంతర్లీన వైరం అక్కడితో ముగియలేదు. తరువాత కండేరు ప్రాంతానికి చేరుకున్న అనంతరం ఈ వివాదం మళ్లీ ఉత్పన్నమైంది. మటామాటా పెరిగి ఉద్రిక్తతకు దారితీసిన ఈ సంఘటనలో వీరన్న కత్తితో విరుచుకుపడినట్లు తెలుస్తోంది.
మనోహర్‌తో పాటు విజయ్, మారుతీల పై కత్తిపోట్లకు పాల్పడగా, మనోహర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అయితే మనోహర్ ఆసుపత్రికి చేరుకునేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విజయ్, మారుతీలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితుడు వీరన్న కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘర్షణకు దారితీసిన అసలు కారణాలు, ముందస్తు వైరం ఉందా? లేక మద్యం మత్తులో జరిగిన తక్షణ వాగ్వాదమేనా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో కర్నూలు నగరంలో భద్రతా పరిస్థితుల పై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా బారు ప్రాంతాల్లో రాత్రివేళల్లో మద్యం మత్తులో జరిగే గొడవలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కూడా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, చిన్న వాగ్వాదం ప్రాణాంతకంగా మారిన ఈ సంఘటన కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తగా, నగరాన్ని భయాందోళనలకు గురి చేసింది. పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తుతో వాస్తవాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
