జీవవైవిధ్య పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి

అడ ప్రాజెక్టు వద్ద అరుదైన అతిథుల సందడి

ఆసియన్ వూలీ-నెక్డ్ స్టార్క్‌ల దర్శనంతో కళకళలాడిన అడ ప్రాజెక్టు

జీవవైవిధ్య సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : జిల్లా కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, జూలై 13 (ఆంధ్రప్రభ):

జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపునిచ్చారు.

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రహదారులు, భవనాలు మాత్రమే కాకుండా ప్రకృతి సంపద, జీవవైవిధ్యం కూడా సమృద్ధిగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. అలాంటి ప్రకృతి వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడ (కొమురం భీం) ప్రాజెక్టు మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఇటీవల ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో అత్యంత అరుదైన ఆసియన్ వూలీ-నెక్డ్ స్టార్క్ (Asian Woolly-necked Stork) పక్షుల జంట కనిపించడం ప్రకృతి ప్రేమికులు, పక్షి పరిశోధకులు, వన్యప్రాణి సంరక్షకుల్లో ఆనందాన్ని నింపింది.

అడ (కొమురం భీం) ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్ కె. హరిత ఈ అరుదైన పక్షులను పరిశీలించి అక్కడి సహజ వాతావరణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పచ్చని అడవులు, చిత్తడి నేలలు, స్వచ్ఛమైన నీటి వనరులు, ప్రశాంతమైన వాతావరణం కారణంగానే ఈ అరుదైన పక్షులు ఇక్కడికి చేరుకున్నాయని తెలిపారు.

ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన సంపద జీవవైవిధ్యమని, అంతరించిపోతున్న అరుదైన పక్షులు జిల్లాలో కనిపించడం గర్వకారణమని అన్నారు. వాటిని సంరక్షించడం ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా సంఖ్య తగ్గుతున్న పక్షి జాతుల్లో ఈ ఆసియన్ వూలీ-నెక్డ్ స్టార్క్ కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ పక్షులు చిత్తడి నేలల ఆరోగ్యానికి సూచికలుగా పరిగణించబడతాయని, కీటకాలు, చిన్న జలచరాలను ఆహారంగా తీసుకుంటూ సహజ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

ఈ పక్షుల రాకతో అడ (కొమురం భీం) ప్రాజెక్టు పరిసరాల్లోని పర్యావరణ పరిస్థితులు వాటి నివాసానికి అనుకూలంగా ఉన్నాయని స్పష్టమవుతోందన్నారు.

అరుదైన పక్షుల సంరక్షణ కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టు పరిసర చిత్తడి నేలలను ఆక్రమణల నుంచి రక్షించాలని, పక్షుల నివాసాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అటవీ, నీటిపారుదల, రెవెన్యూ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

స్థానిక ప్రజలు, పర్యాటకులు కూడా ఈ పక్షులకు ఇబ్బంది కలిగించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు.

అడ ప్రాజెక్టు కేవలం నీటి వనరు మాత్రమే కాదని, ప్రకృతి, పక్షులు, జీవవైవిధ్యానికి సురక్షిత నిలయంగా మారిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అరుదైన అతిథుల రాకతో ఈ ప్రాంతం జీవవైవిధ్య పరిరక్షణకు అనుకూలమైన ప్రాంతంగా మరోసారి గుర్తింపు పొందిందన్నారు.

ప్రకృతిని ప్రేమించి, జీవవైవిధ్యాన్ని సంరక్షించినప్పుడే భావితరాలకు సుసంపన్నమైన పర్యావరణాన్ని అందించగలమని కలెక్టర్ కె. హరిత పిలుపునిచ్చారు.