ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
రెండు పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక
పట్టభద్రుల బరిలో 64 మంది, టీచర్స్ స్థానంలో 10 మంది పోటీ
మూడు స్థానాలకు మొత్తం 1116 పోలింగ్ కేంద్రాలు
ఉపాధ్యాయ స్థానానికి 80 శాతం పైగా ఓటింగ్
గ్రాడ్యుయేట్ స్థానాలలో 50 శాతం లోపే ఓటింగ్
మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపు
ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, లోకేష్
వెలగపూడి, ఆంధ్రప్రభ:
ఏపీలో మూడు అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం నాలుగు గంటలకు ముగిశాయి.. మొత్తం మూడు స్థానాలకు సుమారు 68 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది.. కాగా టీచర్ స్థానానికి ఏకంగా 80 శాతం పైగా ఓటింగ్ నమోదు కాగా, గ్రాడ్యుయేల్ రెండు స్థానాలకు ఓటింగ్ శాతం యాబై కూడా మించకపోవడం విశేషం
ఉపాధ్యాయ బరిలో 10 మంది..
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో పది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం మొత్తం 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 22,493 మంది కాగా, 13,503 మంది పురుషులు, 8,985 మంది మహిళలున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఎన్నిక జరిగింది. యుటీఎఫ్ నుంచి కోరెడ్ల విజయగౌరి, ఏపీటీఎఫ్ తరపున పాకలపాటి రఘువర్మ, పీఆర్‌టీయూ నుంచి గాదె శ్రీనివాసులనాయుడు బరిలో ఉన్నారు.
రెండు స్థానాలలో 64 మంది పోటీ
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 34 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘవులు మధ్యనే ప్రధానంగా పోటీ కొనసాగినట్టు సమాచారం. మొత్తం 3,14,984 ఓట్లు ఉంటే.. 1,83,347 మంది పురుషులు, 1,31,618 మంది మహిళలు ఉన్నారు. 19 మంది ట్రాన్స్ జండర్స్ కూడా ఉన్నారు. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య ప్రధానంగా పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 3,46,529 ఓట్లు ఉన్నాయి. మొత్తం 416 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మూడు స్థానాలకు మార్చి మూడో తేదీన కౌంటింగ్ జరగనుంది.
ఓటేసిన చంద్రబాబు, లోకేష్

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. “ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధం. అందరూ బాధ్యతతో ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం” అని తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి పెమ్మసాని ..

ఉమ్మడి గుంటూరు కృష్ణాజిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెనాలిలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ లో ఓటు వేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మేథావులు, విజ్ఞానవంతులు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఓటు వెయ్యటానికి ఒక్క గంట సమయం వేచించాలని కోరారు. పట్టభద్రులు వేసే ఈ ఓటు విలువ 6ఏళ్ల అభివృద్ధికి ఊతమిస్తుందని గుర్తు చేశారు.
ఓటేసిన మంత్రి నాదెండ్ల..
తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పొన్నూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుటుంబ సభ్యులతో కలని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు
ఇబ్రహీంపట్నంలో ఒకరి ఓటు మరొకరు..
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జాకీర్ హుస్సేన్ డిగ్రీ కళాశాల బూత్ నెంబర్ 45లో క్రమ సంఖ్య 331లో గుంటుపల్లికి చెందిన పాటిబండ్ల జ్ఞానదీప్తి ఓటును మరొకరు వేశారు. ఓటు వేసేందుకు వెళ్లిన ఆమె ఓటు పోలైనట్లు పోలింగ్ అధికారులు తెలపడంతో ఖంగుతిన్నారు. వెంటనే ఎన్నికల సహాయ అధికారి వై.వెంకటేశ్వర్లు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన పోలింగ్ అధికారులతో మాట్లాడారు. పోలింగ్ అధికారులు ఆమెకు చాలెంజ్ ఓటు వేసే అవకాశం కల్పించారు.