నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబాటు…

నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబాటు…

100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు – కలెక్టర్ డా. ఏ. సిరి.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల, చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి వెల్లడించారు. జలధార – నీటి భద్రత కార్యక్రమంలో భాగంగా గురువారం కోసిగి మండలం డి. బెలగల్ గ్రామంలోని చెక్ డ్యామ్, నాగమ్మ చెరువును జాయింట్ కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చెక్ డ్యామ్‌లు, చెరువులను నీటితో నింపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వాగులు, వంకలలో ఉన్న అడ్డంకులను తొలగించి చెరువులకు నీటి ప్రవాహం సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి జిల్లాలోని అన్ని మండలాల్లో అమలు చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. కెనాల్స్‌లో ఉన్న నీటిని ఎల్‌ఎల్‌సీ, చెరువులతో అనుసంధానం చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని 100 శాతం పెంచేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఫీడర్ కెనాల్స్ పరిస్థితి, వాటి సామర్థ్యం, జంగిల్ క్లియరెన్స్, బండ్ల మరమ్మతులపై సమగ్ర అంచనా వేసి తగిన ఎస్టిమేట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

కోసిగి మండలంలో చెరువులు, కుంటలు చాలా కాలంగా ఎండిపోయి ఉండడం లేదా పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ తగ్గిందన్నారు. జిల్లాలో భూగర్భ జలాల సగటు 6.6 మీటర్లు ఉండగా, కోసిగిలో అది 29 మీటర్ల లోతులో ఉండటం ఆందోళనకరమని తెలిపారు. అదే సమయంలో సమీపంలోని పెద్దకడబూరులో కేవలం 2 మీటర్లలోనే నీటి మట్టం ఉండటం గమనార్హమన్నారు. జిల్లా సగటును 4 మీటర్లలోపుకు తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

డ్వామా, ఇరిగేషన్, వ్యవసాయ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో యాక్షన్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. వీబీజీ రామ్‌జీ పథకం కింద పనులను శాస్త్రీయంగా చేపట్టి భూగర్భ జలాల పెంపుదలపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 246 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో ఈసారి వర్షాల కారణంగా 75 శాతం కంటే ఎక్కువ నిండాయని తెలిపారు.

అయితే కేవలం వర్షాలపై ఆధారపడకుండా వాగులు, వంకలు శుభ్రపరిచి చిన్న కుంటలను నింపగలిగితే బోర్‌బావులు తిరిగి పనిచేసే అవకాశముందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి, డ్వామా పీడీ నరసింహ రెడ్డి, ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, కోసిగి తహసీల్దార్ వేణుగోపాల్ శర్మ, ఎల్‌ఎల్‌సీ చైర్మన్ టిప్పు సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply