Nandyala | అదిగో… ఇదిగో…!

Nandyala | అదిగో… ఇదిగో…!

  • దేవాల‌యాల పాలకమండలి నియామ‌కంలో జాప్యం
  • 18 నెలలు నుంచి ఎదురుచూపు
  • దగ్గర పడుతున్న శివరాత్రి పర్వదినం
  • శాసనసభ్యుల నుంచి రికమండేషన్ పేర్లు
  • చైర్మ‌న్ ప‌ద‌వి కోసం టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల పోటీ

Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక దేవాల‌యాలున్నాయి. శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, ఓంకారం తోపాటు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చి 19 నెలల‌ సమయం కావొస్తుంది. చాలా దేవాలయాలకు ఇంతవరకు పాలకమండలి సభ్యులను నియమించకపోవడం విశేషం. గత కొద్దిరోజుల క్రితమే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు అన్నమయ్య జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు పోతుగుంట రమేష్ నాయుడుకు రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ గిరిని కట్టబెట్టింది.

దేశంలోనే అత్యున్నత శక్తి వంతమైన శైవక్షేత్రంలలో ఒకటైన మహానంది ఆలయానికి మహాశివరాత్రి పండుగ సందర్భంగా పాలక మండలి నియమించకపోవడం ఇక్క‌డి భక్తులు అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పలువురు టీడీపీ నేతలు చైర్మన్ పదవి కావాలని పలువురు రాజకీయ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీకి అత్యధిక కాలం నుంచి పనిచేసిన మహానంది మండలంలోని ప్రధాన నాయకులను చైర్మన్‌గా, మెంబర్లుగా నియమించాలని సంబంధిత శాసనసభ్యులను కోరినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ పదవికి పోటీ పెరిగింది. ఇప్పుడు జనసేన కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టు సమాచారం.

శ్రీశైలం బీజేపీకి ఇచ్చారని, మహానంది టీడీపీకి ఇవ్వాలని ప్రజాప్రతినిధులు పట్టుపడుతున్నట్టు సమాచారం. ఎవ‌రికి ఈ పదవిని కట్టబెట్టనుందో.. ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన తరువాతే తెలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మ‌రి కొద్దిరోజుల్లో మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మహానంది పుణ్యక్షేత్రానికి లక్షల సంఖ్య‌లో భక్తులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆలయం పాలక మండలికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక ఫెస్టివల్ కమిటీ వేస్తారా..? అనే సందిగ్ధం పలువురిలో నెలకొంది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని భక్తులు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply