Criminal cases | నకిలీ జీఎస్టీ బిల్లుల ముఠాల పై ఉక్కుపాదం..

Criminal cases | నకిలీ జీఎస్టీ బిల్లుల ముఠాల పై ఉక్కుపాదం..

  • ఐదు కోట్లకు మించిన మోసాల పై క్రిమినల్ కేసులు..
  • జిల్లా ఎస్పీల ద్వారా అరెస్టులు, కలెక్టర్లకు ఫిర్యాదులు..

Criminal cases | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : నకిలీ జీఎస్టీ బిల్లుల ద్వారా ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టిన కేటుగాళ్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జీఎస్టీ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదు కోట్ల రూపాయలకు మించి జీఎస్టీ మోసాలకు పాల్పడిన వ్యక్తులు, సంస్థల పై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలకు అధికారిక ఫిర్యాదులు అందజేయనున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జీఎస్టీ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాయింట్ కమిషనర్లకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అందులో భాగంగా జాయింట్ కమిషనర్లు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అసిస్టెంట్ కమిషనర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో నకిలీ బిల్లుల ద్వారా జరిగిన జీఎస్టీ మోసాల పై సమగ్ర విచారణ చేపట్టి, మోసానికి పాల్పడిన సంస్థలు, వ్యక్తులు, మధ్యవర్తులు, లాభదారుల పూర్తి వివరాలతో కేసు డాక్యుమెంటేషన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. చిత్తూరు జీఎస్టీ పరిధిలో జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం తన పరిధిలోని తొమ్మిది మంది అసిస్టెంట్ కమిషనర్లతో జూమ్ సమావేశం నిర్వహించారు. చిత్తూరు, పలమనేరు, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీ సిటీ, గూడూరు తదితర ప్రాంతాల్లో జరిగిన జీఎస్టీ మోసాల పై లోతైన సమాచారాన్ని సేకరించాలని, బోగస్ బిల్లులు, నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, కాగితాల పై మాత్రమే ఉన్న సంస్థల వివరాలను వెలికితీయాలని ఆదేశించారు.

Criminal cases

అసిస్టెంట్ కమిషనర్లు తమ పరిధిలో గతంలో జరిగిన జీఎస్టీ రిఫండ్‌లు, అనుమానాస్పద లావాదేవీలు, అసలు వ్యాపారం లేకుండానే కోట్ల రూపాయల టర్నోవర్ చూపిన సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాథమిక దర్యాప్తులోనే పలు షెల్ కంపెనీలు, నకిలీ చిరునామాలు, బోగస్ బ్యాంక్ ఖాతాలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలతో సమగ్ర ఫిర్యాదులు తయారు చేసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు అందజేయాలని ఆదేశాలు ఉన్నాయి. వాటి ఆధారంగా పోలీసు శాఖ క్రిమినల్ కేసులు నమోదు చేసి, అరెస్టు వారెంట్లు జారీ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. అవసరమైతే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, మోసగాళ్ల ఆస్తులను జప్తు దిశగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

కేవలం కేటుగాళ్లపైనే కాదు, వారికి సహకరించిన అధికారుల పాత్ర పై కూడా విచారణ జరిపేందుకు జీఎస్టీ ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రత్యక్ష సహకారం అందించినట్లు తేలితే శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశముంది. బోగస్ బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ముఠాలకు ఇక బేడీలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ మోసాల పై గట్టి సందేశం వెళ్లనుందని, నిజాయితీగా పన్నులు చెల్లించే వ్యాపారులకు ఇది రక్షణగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply