Women’s Cricket | దేశవాళీ ప్లేయర్లపై కాసుల వర్షం !!

ఆంధ్రప్రభ : భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో దేశవ్యాప్తంగా మహిళల క్రికెట్‌పై అంచనాలు, ఆసక్తి ఒక్కసారిగా పెరిగాయి. ఈ క్రేజ్‌ను మరింతగా ముందుకు తీసుకెళ్తూ, క్షేత్రస్థాయిలో క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవాళీ క్రికెటర్ల వేతనాలను పెంచుతూ బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం, భారత మహిళా క్రికెట్ రూపురేఖలను పూర్తిగా మార్చబోతోంది. మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) కల్పిస్తున్న అవకాశాలతో పాటు, ఈ ఆర్థిక వెన్నుదన్ను యువ క్రీడాకారిణులకు కొండంత అండగా నిలవనుంది.
ముంబైలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ సీనియర్, జూనియర్ విభాగాల వేతనాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. సీనియర్ దేశవాళీ పోటీల్లో ఆడే మొదటి XI (ప్లేయింగ్ ఎలెవన్) క్రీడాకారిణుల మ్యాచ్ ఫీజును రోజుకు రూ.20,000 నుండి రూ.50,000కు పెంచారు. అంటే ఒక్కో మ్యాచ్ రోజుకు ప్లేయర్లకు అదనంగా రూ.30,000 లభించనున్నాయి. కేవలం ఆడేవారికే కాకుండా, బెంచ్ మీద ఉండే రిజర్వ్ ప్లేయర్‌లకు కూడా గతంలో కంటే ఎక్కువగా రోజుకు రూ.25,000 అందజేయనున్నారు.
జూనియర్ (వయో పరిమితి) విభాగంలో కూడా ఇదే తరహా పెంపు కనిపిస్తోంది. గతంలో రోజుకు రూ.10,000 పొందే ప్లేయింగ్ ఎలెవన్ క్రీడాకారిణులకు ఇప్పుడు రూ.25,000, అలాగే రిజర్వ్ ప్లేయర్‌లకు రూ.12,500 లభించనున్నాయి. ఈ భారీ పెంపుతో దేశవాళీ క్రికెటర్ల వార్షిక ఆదాయం గణనీయంగా పెరగనుండటం విశేషం.
గతంలో ఒక పూర్తి సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే దాదాపు రూ.2 లక్షల ఆదాయం లభించేది, కానీ తాజా సవరణతో ఆ మొత్తం రూ.5 లక్షలకు చేరుకోనుంది. ప్రపంచకప్ విజయం తర్వాత పెరిగిన క్రేజ్, డబ్ల్యూపీఎల్ ద్వారా వస్తున్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ అడుగు వేసింది.
2022లో బీసీసీఐ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం వల్ల మ్యాచ్ ఫీజుల విషయంలో లింగ వివక్ష తొలగిపోయింది. ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లు కూడా ఒక టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు అందుకుంటున్నారు. ఇది మైదానంలో వారు పడే కష్టానికి దక్కిన గౌరవంగా క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, వార్షిక ‘సెంట్రల్ కాంట్రాక్టు’ (Central Contracts) విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటికీ మహిళా క్రికెటర్ల వార్షిక ఒప్పందాల మొత్తంలో ఎటువంటి మార్పులు చేయలేదు. అత్యున్నత గ్రేడ్ (Grade A) లో ఉన్న అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లకు ఏడాదికి రూ.50 లక్షలు మాత్రమే అందుతున్నాయి. ఇది పురుషుల కాంట్రాక్టుల్లోని అత్యల్ప స్లాబ్ (Grade C – రూ.1 కోటి) కంటే కూడా తక్కువగా ఉండటం గమనార్హం. మ్యాచ్ ఫీజులను సమానం చేసిన బీసీసీఐ, భవిష్యత్తులో ఈ వార్షిక కాంట్రాక్టుల వ్యత్యాసాన్ని కూడా తగ్గిస్తే మహిళా క్రికెట్ మరింత వృత్తిపరంగా, ఆర్థికంగా బలోపేతం అవుతుందని క్రీడాకారిణులు ఆశిస్తున్నారు.
