AP | కమ్మేసిన మంచు దుప్పటి..

AP | కమ్మేసిన మంచు దుప్పటి..

AP , కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : శీతాకాలం ప్రారంభం కావటంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంచు దుప్పటి కమ్మేసింది. జిల్లాలోని అవనిగడ్డ, పెడన, గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో భారీగా మంచు కురిసింది. ఉదయం 3 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మంచు కురుస్తూనే ఉంది. ప్రధాన రహదారుల్లో ముందుగా వెళ్తున్న వాహనాలు కనిపించకపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలు సైతం వచ్చే వరకు తెలియకపోవటంతో లైట్లు వేసుకుని ప్రయాణాలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందలు పడుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు.

మంగళవారం తెల్లవారుజాము మంచు కారణంగా హనుమాన్ జంక్షన్ లో ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించకపోవటంతో ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కనీసం దగ్గరకు వచ్చేంత వరకు ఎలాంటి వాహనాలు కనిపించని విధంగా మంచు కురుస్తోంది. ఉదయాన్నే వాకింగ్ చేసే వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనటంతో ప్రజలు జలుబు, దగ్గుతో ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం 9 గంటలు దాటిన తర్వాతే ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావటం కనిపించింది. ద్విచక్ర వాహనాల పై ప్రయాణించే వారి శరీరమంతా మంచు కురిసి నీళ్ల మాదిరిగా మారటం కనిపించింది.

Leave a Reply