టాప్ టెన్ లో ఉందాం

10వ తరగతిలో నూరుశాతం పాసవ్వాలి
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి

( నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో)
విద్యార్థుల భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులతో కలిసి పదవ తరగతి ఫలితాలు, విద్యార్థుల హాజరు, పాఠశాల పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం, అపార్ ఐడి తదితర అంశాలపై ఉపాధ్యాయులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో డిఈఓ జనార్దన్ రెడ్డి, ఎస్ఎస్ఏ పిఓ ప్రేమనాథ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వారి భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. పాఠశాలలో విద్యార్థుల విద్య, ప్రవర్తన, పరిశుభ్రత, సామాజిక నైపుణ్యాల పెంపుదల తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఉపాధ్యాయుల శ్రద్ధతోనే సాధ్యమవుతాయని కలెక్టర్ సూచించారు.
విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, సహ విద్యార్థులతో ఎలా మెలగాలి, గురువులను గౌరవించడం, తల్లిదండ్రులతో సమన్వయం వంటి అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. అదేవిధంగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు వంద శాతం హాజరు నమోదు చేయడం అత్యంత ముఖ్యమని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లక్ష్యం ప్రతీ పాఠశాలను పరిశుభ్రమైన ప్రదేశంగా మారుస్తూ పిల్లల్లో పరిశుభ్రత అలవాటు పెంచడమని కలెక్టర్ వివరించారు.
