ఆ డాక్టర్ అరెస్ట్ !!

  • మధ్యప్రదేశ్లో 14 మంది చిన్నారులు మృతి
  • విషపదార్థాన్ని పట్టిన చైన్నై ల్యాబ్

ఆంధ్రప్రభ, భోపాల్ : ఓ దగ్గు మందు 14 మంది చిన్నారులను కాటేసింది. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. దగ్గు ఉపశమనం కోసం కోల్డ్రిఫ్ కఫ్ సిరప్ తాగిన 14 మంది చిన్నారులు కిడ్నీలు దెబ్బతిని (renal failure) మరణించారు.

ఈ దుర్ఘటన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెంటనే రాష్ట్రమంతటా ఈ సిరప్ అమ్మకాలు, పంపిణీని నిలిపి వేసింది. డాక్టరును అరెస్టు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చెన్నైలోని డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లో జరిగిన పరీక్షల్లో ఒక భయంకరమైన విషయం బయటపడింది. కోల్డ్రిఫ్ అనే దగ్గు సిరప్‌లో ఏకంగా 48.6 శాతం డయిథైలిన్ గ్లైకాల్ అనే ప్రమాదకరమైన విష రసాయనం కలిసి ఉన్నట్లు తేలింది.

దీంతో సిరప్ తయారీదారైన తమిళనాడులోని కాంచీపురం కేంద్రంగా పనిచేసే శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీతో పాటు, ఈ సిరప్‌ను రాసిన డాక్టర్ ప్రవీణ్ సోనిపై కూడా చర్యలు తీసుకున్నారు. డాక్టర్ సోని ప్రభుత్వ వైద్యుడైనా కూడా, తన ప్రైవేట్ క్లినిక్‌లో ఈ సిరప్‌ను ప్రిస్క్రైబ్ చేసిన‌ట్టు, అంతేకాక పిల్లల్లో నెల రోజుల పాటు దుష్ప్రభావాలు గమనించినా నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు డాక్టర్ సోనిని BNS సెక్షన్ 276 (ఔషధాల కల్తీ), BNS సెక్షన్ 105 (హత్య) కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

అయితే, ఈ కేసు ఇంకా కోర్టులో విచారణ దశలో ఉంది. దర్యాప్తు వివరాలు, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకుంటుంది.