రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు

జూన్‌ 26, 2027 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు..
67 ఘాట్ల అభివృద్ధి.. భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణలో జరగనున్న గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 2027 జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు జరిగే పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని గోదావరి పుష్కరాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌, రవాణా, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించింది.

పుష్కర ఏర్పాట్లపై మంత్రుల కమిటీ సమీక్ష

క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌, మంత్రి డి. శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖలు చేపడుతున్న పనుల పురోగతిని మంత్రుల బృందం సమీక్షించింది. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

67 పుష్కర ఘాట్ల అభివృద్ధి

గోదావరి నదీ తీరంలోని నిజామాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొత్తం 67 పుష్కర ఘాట్లను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘాట్లను మూడు దశల్లో అభివృద్ధి చేయడంతో పాటు పుష్కరాల సమగ్ర ఏర్పాట్ల కోసం వివిధ శాఖల పరిధిలో రూ.1000 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వివరించారు.

భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌, రవాణా, వైద్య సేవలను సమర్థంగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అవసరమైతే వర్చువల్‌ సమావేశాల ద్వారా పర్యవేక్షించాలని చెప్పారు.

డ్యాష్‌బోర్డు ద్వారా పనుల పర్యవేక్షణ

పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన పనులు, వాటి పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించేందుకు వీలుగా ప్రత్యేక డ్యాష్‌బోర్డు రూపొందించాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలు చేపడుతున్న పనుల వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక నిధుల అవసరంపై ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఆధ్యాత్మిక వైభవం ప్రతిబింబించేలా ఏర్పాట్లు

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పుష్కర ప్రాంతాల్లో ఆయా క్షేత్రాల చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను ప్రతిబింబించేలా స్వాగత ద్వారాలు, ప్రత్యేక అలంకరణలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేసే సమాచార బోర్డులు, దృశ్యరూప ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే పుష్కరాల సమయంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, గోదావరి జలాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం

లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సూచించారు. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, బారికేడ్లు, స్నాన ఘాట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో జరిగిన తోపులాట ఘటనలను దృష్టిలో పెట్టుకుని పటిష్ట భద్రతా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పోలీస్‌ అధికారులు వివరించారు.

ప్రచారం, రవాణా ఏర్పాట్లు

పుష్కరాల ప్రారంభానికి ముందే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. భద్రాచలం, ధర్మపురి వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తాత్కాలిక బస్‌ షెల్టర్లు, ప్రయాణికుల వేచి ఉండే ప్రాంతాలు, పార్కింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆర్టీసీ అధికారులకు సూచించారు.

పరిశుభ్రతకు ప్రత్యేక ప్రణాళిక

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఘాట్లు, గ్రామాల పరిసరాల్లో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లు, తాగునీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు అవసరమైన సిబ్బంది, వనరులను అందుబాటులో ఉంచాలని చెప్పారు.