భూత్పూర్‌లో ప్రైవేట్‌ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమా? పోలీసుల దర్యాప్తు

భూత్పూర్, ఆంధ్రప్రభ: భూత్పూర్‌ మండల పరిధిలోని జాతీయ రహదారి 44పై గురువారం అర్ధరాత్రి ప్రైవేట్‌ బస్సు బోల్తాపడిన ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి అరుణాచలం వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు భూత్పూర్‌ శివారులోని భారత్‌ పెట్రోల్‌ పంపు సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఎస్సై నాగన్న తెలిపిన వివరాల ప్రకారం.. రమాదేవి తన స్నేహితులు లక్ష్మీదుర్గ, సత్యవతి, లావణ్య, సాయితేజతో పాటు ఇతర ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నారు. రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన బస్సు సుమారు 11.50 గంటలకు భూత్పూర్‌ శివారుకు చేరుకుంది. ఈ సమయంలో డ్రైవర్‌ అతివేగంగా, అజాగ్రత్తగా బస్సు నడపడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రమాదంలో లక్ష్మీదుర్గ, సాయితేజకు గాయాలు కాగా, మహేశ్వరి, శరణప్ప, సంతోషిని, లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స అందుతోంది. రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూత్పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.