కదిరిలో రెపరెపలాడిన వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకం..
- హర్ ఘర్ తిరంగా ర్యాలీతో ఉప్పొంగిన దేశభక్తి
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కదిరి పట్టణంలో శుక్రవారం దేశభక్తి ఉప్పొంగింది. వెయ్యి అడుగుల సుదీర్ఘమైన భారీ త్రివర్ణ పతాకంతో నిర్వహించిన తిరంగా ర్యాలీ జనసందోహం మధ్య వైభవంగా సాగింది. పట్టణ పురవీధులు త్రివర్ణ శోభతో కళకళలాడగా, విద్యార్థులు, యువత, ప్రజలు చేసిన “వందేమాతరం.. భారత్ మాతాకీ జై” నినాదాలతో కదిరి మారుమోగింది.
కదిరి మున్సిపల్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ మీదుగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది.
వెయ్యి అడుగుల భారీ జాతీయ పతాకాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు కలిసి పట్టుకుని ముందుకు సాగారు. ర్యాలీ మార్గమంతా జాతీయ జెండాలతో కళకళలాడగా, దేశభక్తి గీతాలు, నినాదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దేశ సమగ్రతకు త్రివర్ణ పతాకం ప్రతీక…
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ జెండా భారతదేశ సార్వభౌమాధికారానికి, దేశం కోసం చేసిన త్యాగాలకు, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడానికి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గొప్ప అవకాశమన్నారు.
ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై, వ్యాపార సముదాయాలపై స్వచ్ఛందంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. భారీ ర్యాలీని విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఘనంగా ప్రతిజ్ఞ..
ర్యాలీ అనంతరం అంబేద్కర్ సర్కిల్ వద్ద జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి దేశ సమగ్రత, ఐక్యత, దేశసేవపై దేశభక్తి ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో కదిరి ఆర్డీఓ కలావతి, తహశీల్దార్ రెడ్డి శేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
