యూపీ ఎన్నికల్లో జెన్ జీ ప్రభావం?

-యువ ఓటు వైపు పార్టీల చూపు..
-పాత సమీకరణాలకు కొత్త సవాల్!
-ప్రశాంత్ కిషోర్ విజయంతో కొత్త చర్చకు తెర

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశంలో అత్యదికంగా అసెంబ్లీ సీట్లు కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటి వరకు కులం, మతం, ప్రాంతీయ సమీకరణాల చుట్టూ తిరిగిన ఎన్నికల వ్యూహాలు.. ఇప్పుడు యువత సమస్యల వైపు మళ్లుతున్నాయా? బీహార్‌లోని బకీంపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ విజయం తర్వాత జెన్ జీ ఓటు ప్రభావంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ జనాభాలో 15 శాతం ఉన్న యువతరం తమ ఓట్లతో ఫలితాలను పూర్తిగా తారుమారు చేసే అవకాశం ఉంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజయం తరువాత ప్రధాన పార్టీలన్నీ యువతారక మంత్రం జపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

యూపీపై జెన్ జీ ప్రభావం ఉంటుందా?

దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్‌లో యువ ఓటర్ల పాత్ర కీలకంగా మారుతోంది. రాష్ట్ర జనాభాలో గణనీయమైన శాతం యువత ఉండటంతో, వారి ఆలోచనలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు, విద్య, మహిళల భద్రత, జీవన వ్యయం వంటి అంశాలు యువత ఓటు నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా మారుతున్నాయి. బీహార్‌లో బకీంపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ విజయం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మూడు దశాబ్దాలుగా కమలం పార్టీకి కంచుకోటగా ఉన్నా ఆ స్థానాన్ని పీకే బద్దలు కొట్టడం గమనార్హంగా మారింది. ఈ విజయం యువతలో మార్పు ఆకాంక్షకు సంకేతమా అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. అయితే ప్రశాంత్ కిషోర్ స్వయంగా కూడా ఈ విజయానికి కేవలం జెన్ జీ ఉద్యమమే కారణం కాదని, స్థానిక రాజకీయ పరిస్థితులు కూడా కీలకమని పేర్కొన్నారు.

ఉద్యోగాలు.. భద్రత ప్రధాన అంశాలా?
యువతరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఉద్యోగాల కొరత ఒకటి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పెరగడం, ప్రైవేటు రంగంలో అవకాశాలపై అనిశ్చితి యువ ఓటర్లలో అసంతృప్తిని పెంచుతున్నాయి. బీహార్‌లో ప్రశాంత్ కిషోర్ కూడా యువతకు ఉపాధి అవకాశాల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే మహిళల భద్రత అంశం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. కుటుంబ భద్రత, ఉపాధి, విద్య వంటి అంశాలపై యువత అభిప్రాయాలు మారుతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

కుల, మత సమీకరణాలకు భిన్నంగా కొత్త వ్యూహాలు
ఇప్పటి వరకు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కుల సమీకరణాలు కీలక పాత్ర పోషించాయి. అయితే డిజిటల్ యుగంలో పెరిగిన కొత్త తరం ఓటర్లు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా అభివృద్ధి, అవకాశాలు, పారదర్శక పాలన వంటి అంశాలను ప్రాధాన్యంగా చూస్తున్నారని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇటీవల యువతకు సంబంధించిన ఉద్యమాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం కూడా రాజకీయ పార్టీల వ్యూహాలను మార్చేలా చేస్తున్నాయి. యువతను ఆకర్షించేందుకు అన్ని ప్రధాన పార్టీలు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

యువ ఓటు కోసం పార్టీల పోటీ
రాబోయే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకట్టుకోవడం ప్రధాన లక్ష్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ హామీలు, విద్యా సంస్కరణలు, మహిళల భద్రత, డిజిటల్ అవకాశాలు వంటి అంశాలపై పార్టీలు ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. మొత్తంగా బీహార్ బకీంపూర్ ఫలితం ఒక్కటే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల దిశను నిర్ణయించకపోయినా.. యువత రాజకీయ ప్రాధాన్యం పెరుగుతోందనే సంకేతాన్ని మాత్రం ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక యూపీ ఎన్నికల్లో జెన్ జీ ఓటు ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.