పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత..

పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం
సీఎం చంద్రబాబుకు లబ్ధిదారుల తరపున ధన్యవాదములు
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
30మందికి రూ.9,49,899లు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం
కూటమి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.13,71,65,226లు ఆర్థిక సహాయం


అవనిగడ్డ, ఆంధ్రప్రభ : పేదల వైద్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రీ-ఎంబర్సుమెంట్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 30మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన రూ.9,49,899లు ఆర్థిక సహాయం అందచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. పేదలు తమ వైద్య అవసరాల కోసం తమ కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపే దరఖాస్తులను సీఎం చంద్రబాబు సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తూ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటివరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.13,71,65,226లు ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. లబ్ధిదారుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.