జోగిపేట్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్‌..

  • 31 ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం

ఇచ్చోడ, ఆంధ్రప్రభ : ప్రజల రక్షణ, సంరక్షణను సమర్థంగా నిర్వహించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇచ్చోడ రూరల్‌ సీఐ సీహెచ్‌. రమేష్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఇచ్చోడ మండలంలోని జోగిపేట్‌ గ్రామంలో 50 మంది పోలీసు సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని ఐదు వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సీఐ తెలిపారు. అలాగే రూ.5 వేల విలువైన కలపను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి

ఈ సందర్భంగా సీఐ రమేష్‌ ప్రజలతో మాట్లాడుతూ అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడవద్దని హెచ్చరించారు. గొడవలకు దారితీసేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

నంబర్‌ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం, దొంగ వాహనాలను కొనుగోలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. గతంలో కేసులు నమోదైన వారిపై అనుమానితుల పట్టికలు, రౌడీషీట్లు తెరిచినట్లు తెలిపారు. మిగిలిన వారిపై కూడా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి

విద్యార్థులకు చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు కృషి చేయాలని సీఐ సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ ఎస్‌హెచ్‌వో కే. నరేష్‌కుమార్‌, ఎస్‌ఐలు శ్రీకాంత్‌, విక్రమ్‌, ఈశ్వర్‌, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.