కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..
ఆగస్టు 18 నుంచి కొత్త ట్రాఫిక్ విధానం
హెచ్-సిటీ పనుల నేపథ్యంలో కీలక మార్పులు..
కుడి మలుపులకు నో..
వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసుల సూచన
హైదరాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ నిబంధనలు మారనున్నాయి. హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల నేపథ్యంలో ఆగస్టు 18, 2026 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న కాలంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, వాహనాల రాకపోకలను సజావుగా నిర్వహించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. గతంలో నిర్వహించిన ప్రయోగాత్మక వన్‌వేలో ట్రాఫిక్ కదలిక కొంత మెరుగుపడినట్లు అధికారులు గుర్తించారు.
కుడి మలుపులకు పూర్తిగా నిషేధం
కొత్త విధానంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రహదారుల్లో కుడి వైపు మలుపులు తీసుకోవడంపై ఆంక్షలు ఉంటాయి. వాహనదారులు నేరుగా కుడి మలుపు తీసుకోకుండా, అధికారులు ఏర్పాటు చేసిన లేన్ మార్పులు, ఎగ్జిట్లను ఉపయోగించాల్సి ఉంటుంది. వాహనాలు సురక్షితంగా ఒక లేన్ నుంచి మరో లేన్‌కు మారేందుకు 10 లేన్ చేంజర్లు, 13 ఎగ్జిట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసే సూచికలు, రహదారి సంకేతాలను గమనిస్తూ ప్రయాణించాలని సూచించారు.
పంజాగుట్ట నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు..
పంజాగుట్ట నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనదారులు కేబీఆర్ పార్క్ సమీపంలో కుడి మలుపు తీసుకోకూడదు. ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమవైపు మలుపు తీసుకుని, తెలంగాణ స్టడీ సర్కిల్ వద్ద లేన్ మార్చుకోవాలి. అక్కడి నుంచి అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్, ఫీనిక్స్ బిల్డింగ్ మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లేలా మార్గాన్ని అనుసరించాలి.
యూసుఫ్‌గూడ నుంచి మాదాపూర్ వెళ్లేవారికి..
యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు ఇందిరానగర్ గడ్డ రోడ్ లేదా వెంకటగిరి జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకోవాలి. అనంతరం రోడ్ నంబర్ 10లోని డైమండ్ హౌస్, అల్కాజర్ ప్రాంతం వద్ద మళ్లీ కుడివైపు తిరిగి రోడ్ నంబర్ 36 మీదుగా మాదాపూర్ వైపు వెళ్లాలి.
కేబుల్ బ్రిడ్జి నుంచి రోడ్ నంబర్ 12కు..
కేబుల్ బ్రిడ్జి నుంచి రోడ్ నంబర్ 12 వైపు వెళ్లే వాహనదారులు రోడ్ నంబర్ 45 జంక్షన్ వద్ద ఎడమ మలుపు తీసుకుని, అనంతరం కుడి లేన్‌లోకి మారాలి. జూబ్లీ చెక్‌పోస్ట్, ఎన్టీఆర్ భవన్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మీదుగా వెళ్లి బీఆర్‌ఎస్ భవన్ వద్ద అవసరమైన లేన్ మార్పు చేసుకుని రోడ్ నంబర్ 12 వైపు వెళ్లేలా మార్గాన్ని అనుసరించాలి.
నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు మార్పులు
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో హెచ్-సిటీ ప్రాజెక్టు కింద పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, కీలక ప్రాంతాల మధ్య రాకపోకలను సులభతరం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. గతంలో నిర్వహించిన ప్రయోగాత్మక వన్‌వే సందర్భంగా అధికారులు ట్రాఫిక్ ప్రవాహాన్ని పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో లేన్ మార్పులు, జంక్షన్ల వద్ద వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తదుపరి మార్పులను పరిశీలించారు.
వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు
కొత్త ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వాహనదారులు రహదారి సంకేతాలను తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వాహనాలను రోడ్డుపై ఇష్టానుసారంగా నిలపకుండా కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలు, బహుళ అంతస్తుల పార్కింగ్ సదుపాయాలను మాత్రమే ఉపయోగించాలని కోరారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో రాంగ్‌రూట్‌లో వాహనాలు నడపకూడదని, వన్‌వే మార్గంలో ఎదురుగా వచ్చే ప్రయత్నం చేయరాదని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల సూచనలకు వాహనదారులు సహకరించాలని కోరారు.
వాకర్ల సూచనల కోసం QR కోడ్
కేబీఆర్ పార్క్‌కు నిత్యం వచ్చే వాకర్లు, సందర్శకుల నుంచి కొత్త ట్రాఫిక్ విధానంపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు పార్క్ సమీపంలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్త విధానంలో ఎదురయ్యే సమస్యలు, అవసరమైన మార్పులపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.
ముందుగానే ప్రయాణ ప్రణాళిక..
ఆగస్టు 18 నుంచి మారనున్న ట్రాఫిక్ విధానంతో కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణ మార్గాలు మారనున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్ వైపు నిత్యం రాకపోకలు సాగించే వారు తమ గమ్యస్థానానికి చేరుకునే ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే తెలుసుకుని బయలుదేరడం మంచిది. ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాలను పాటించడం ద్వారా రద్దీ, గందరగోళాన్ని తగ్గించడంతో పాటు కొత్త వన్‌వే విధానం సజావుగా అమలయ్యేలా వాహనదారులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
వీడియో చూడాలనుకుంటే ఈ లింక్ ను క్లిక్ చేయండి.
https://twitter.com/HYDTP/status/2087943746252050592/video/1
