డీజిల్ లెక్కలపై అనుమానాలు.. విచారణకు డిమాండ్

  • మున్సిపల్ డీజిల్ ప్రైవేటు వాహనాలకు వెళ్లిందన్న ఆరోపణలు
  • వాహనాల వివరాలు లేకుండానే లెక్కల నమోదు?
  • లక్షల రూపాయల నష్టం జరిగిందంటున్న స్థానికులు
  • లాగ్‌బుక్ వివరాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
  • పాత మంచినీటి ట్యాంక్ విక్రయంపైనా వివాదం
  • సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్


అశ్వారావుపేట మున్సిపాలిటీలో డీజిల్ వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ వాహనాల కోసం కేటాయించిన డీజిల్‌ను అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లు, ప్రైవేటు వాహనాలకు వినియోగించారన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. వాహనాల వివరాలు లేకుండానే లెక్కలు నమోదు చేశారన్న విమర్శలు వినిపిస్తుండగా, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

అశ్వారావుపేట (ఆంధ్రప్రభ): నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట మున్సిపాలిటీ పూర్తిగా నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుండగా వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ ఈ విషయంలో జోక్యం చేసుకుని ఒక అడుగు ముందుకు వేసి సుమారు రూ.50 లక్షల వరకు తన సొంత ఖర్చుతో నిధులను మున్సిపాలిటీ అభివృద్ధికి వినియోగించి (పెట్టుబడి పెట్టి) అభివృద్ధి ఆగకుండా అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే మరో కోణంలో ఒకరిద్దరు చోటామోటా నాయకులు పెద్దాయన పరువు బహిరంగంగా తీస్తున్నారన్న విమర్శలు పట్టణవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. తాజాగా మున్సిపాలిటీలో చోటుచేసుకున్న డీజిల్ కుంభకోణం ఈ విషయంలో పతాక స్థాయికి చేరిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇద్దరు చోటామోటా నాయకులు ఏళ్ల తరబడి మండలంలో అక్రమ ఇసుక రవాణా చేసి లక్షలు గడిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మున్సిపాలిటీ డీజిల్ వినియోగంలోనూ అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు స్థానికంగా వచ్చిన సమాచారం ఆధారంగా వినిపిస్తున్నాయి.

గురువారం ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో మున్సిపాలిటీ అధికారులు తమ వాహనాలకు డీజిల్ కొట్టించే బంకు వద్దకు వెళ్లి వివరాలు పరిశీలించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

ట్రాక్టర్లు, చెత్త వాహనాలలో కొట్టించిన డీజిల్‌లో లక్షలాది రూపాయల అక్రమం చోటుచేసుకుందన్న ఆరోపణలు బహిరంగ రహస్యంగా మారాయి.

వాహనాల వివరాలు లేకుండానే డీజిల్ లెక్కలు?

పెట్రోల్ బంకులో మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఉన్న లెడ్జర్‌ను పరిశీలిస్తే, ఇంచుమించుగా ఏదో ఒకటి అర సందర్భాలు మినహా మున్సిపాలిటీ లెక్కల్లోనే డీజిల్ కొట్టించుకుని లక్షలాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు పట్టణంలో వినిపిస్తున్నాయి.

ఇసుక ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, కార్లకు మున్సిపాలిటీ వాహనాలకు డీజిల్ కొట్టించే పెట్రోల్ బంకులోనే డీజిల్ కొట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి.

సదరు చోటామోటా నాయకులు తమ వాహనాల నెంబర్లను ప్రకటించకుండానే డీజిల్ నగదును మాత్రమే రోజువారీగా నమోదు చేసినట్లు కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ట్రాక్టర్‌కు ఫుల్ ట్యాంక్ చేయడానికి 50 లీటర్లు, చెత్త వాహనాలకు మహా అయితే 30 లీటర్లు ఆయిల్ పడుతుంది. కానీ ఒక రోజులోనే ట్రాక్టర్‌కు 150 లీటర్లకు పైగా, చెత్త వాహనానికి వంద లీటర్లకు పైగా ఆయిల్ కొట్టించిన సందర్భాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

అసలు ఏ వాహనం వచ్చింది? ఏ వాహనానికి ఎంత డీజిల్ కొట్టించారు? అనే వివరాలు లేకపోవడం గమనార్హం.

లెక్కల్లో పారదర్శకత ఏదీ?

ఈ నెలలోనే చూసుకుంటే మూడో తేదీన రూ.17,000, నాలుగో తేదీన రూ.18,000.. మొత్తం రూ.35 వేల రూపాయలకు పైగా డీజిల్ కొట్టించినట్లు ఉందని సమాచారం. కానీ ఏ వాహనాలకు కొట్టించారన్న వివరాలు లేవని ఆరోపణలు ఉన్నాయి.

నెలల తరబడి ఇదే తతంగం కొనసాగుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు.

మున్సిపాలిటీలో ఉన్న వాహనాలకు డీజిల్ కొట్టించుకునే సందర్భంలో ఈ వ్యవహారంలో సంబంధం లేని ప్రైవేటు వాహనాలకు, ఇసుక ట్రాక్టర్లకు మున్సిపల్ వాహనాల పేరుతో డీజిల్ కొట్టించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కమిషనర్ వివరణపై అనుమానాలు

ఈ అంశంపై వివరణ కోసం మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డిని పాత్రికేయులు అడిగితే.. అటువంటిదేమీ లేదని, అంతా సజావుగానే ఉందని చెప్పడం గమనార్హం.

లాగ్‌బుక్ తమ వద్ద ఉందని కమిషనర్ చెప్పడంతో పాత్రికేయులు వివరాలు అడిగారు. సాయంత్రం లాగ్‌బుక్ ఇస్తానని చెప్పిన కమిషనర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు, సూపర్‌వైజర్ ద్వారా మరుసటి రోజు ఇస్తామని చెప్పి పంపించారని సమాచారం.

ఇద్దరు చోటామోటా నాయకులు చేసిన వ్యవహారానికి కమిషనర్ ఇబ్బందుల్లో పడినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. జరిగిన తప్పును సరిదిద్దుకోలేక, మీడియాకు సమాధానం ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపించిందని చెబుతున్నారు.

పాత మంచినీటి ట్యాంక్ విక్రయంపైనా వివాదం

పట్టణంలోని కోత మిషన్ బజార్లో దశాబ్దాల తరబడి నిరుపయోగంగా ఉన్న మంచినీటి ట్యాంకును కూడా ఒకరిద్దరు నేతలు డిస్మాంటిల్ చేసి పాత ఇనుప సామాను వారికి రూ.40 వేలకే అమ్మేశారన్న ఆరోపణలు పట్టణంలో వివాదాస్పదమయ్యాయి.

ఈ అంశంపై పలు పత్రికల్లో కథనాలు రావడంతో కమిషనర్ స్పందిస్తూ.. ట్యాంకుకు తాను వేలం నిర్వహిస్తానని చెప్పడం చర్చనీయాంశమైంది.

ఇలా ఒకటేంటి ఎన్నో వ్యవహారాల్లో చోటామోటా నాయకులు పెద్దాయన పరువు తీస్తున్నారని మున్సిపాలిటీలో పలువురు స్థానిక నాయకులు, ప్రముఖులు మాట్లాడుతున్నారు.

చైర్మన్, వైస్ చైర్మన్లు మున్సిపాలిటీ అభివృద్ధిపై చిత్తశుద్ధితో వ్యవహరిస్తుండగా కొందరు చేస్తున్న పనులతో వారికి చెడ్డ పేరు వస్తుందని, వారిని నిలువరించాలని కోరుతున్నారు.

ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడిన వారిపై సమగ్ర విచారణ నిర్వహించి, డీజిల్, ఇనుప ట్యాంక్ రూపంలో జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలని మున్సిపాలిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.