ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. కొత్తగా 3 పాజిటివ్ కేసులు
అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీలో కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. రాష్ట్రంలో గురువారం కొత్తగా 3 కరోనా కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 41 కరోనా నమూనాలను పరీక్షించగా ముగ్గురికి వైరస్ నిర్ధారణ అయిందని వెల్లడించింది.
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 71 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం వీరిలో నలుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మరో ఏడుగురు ఇంటివద్దే ఐసొలేషన్లో ఉన్నారు. ఇప్పటివరకు 56 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటివరకు 4 మరణాలు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
విశాఖలో రెండు.. తూర్పుగోదావరిలో ఒక కేసు
తాజాగా నమోదైన మూడు కేసుల్లో విశాఖపట్నంలో రెండు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక కేసునమోదైంది. విశాఖపట్నంలో ప్రస్తుతం రెండు యాక్టివ్ కేసులు ఉండగా.. తూర్పుగోదావరిలో ఒక యాక్టివ్ కేసు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక రాష్ట్రంలోని కాకినాడ, విజయవాడ, నెల్లూరు, విజయనగరం తదితర జిల్లాల్లోనూ కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో పేర్కొంది. కొత్త కేసుల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షిస్తోంది. నమూనాల పరీక్షలు, బాధితుల చికిత్స, హోం ఐసొలేషన్లో ఉన్న వారి పరిస్థితిపై అధికారులు దృష్టి సారించారు.
