ధ‌ర్నా చౌక్ వ‌ద్ద స్టైపెండ్‌ పెంపు కోసం ఆందోళ‌న‌

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : స్టైపెండ్‌ పెంపు కోసం ఆయూష్ హౌస్‌ సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థులు హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో ఆందోళనకు దిగారు. పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్‌ పెంపు అంశంపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. ప్రస్తుతం తమకు అందుతున్న స్టైపెండ్‌ ఇతర వైద్య విద్యార్థులతో పోలిస్తే తక్కువగా ఉందని ఆయూష్ వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే వైద్య విద్యా వ్యవస్థలో శిక్షణ పొందుతున్నప్పటికీ స్టైపెండ్‌ విషయంలో అసమానత ఎందుకు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

చాలా కాలంగా స్టైపెండ్‌ పెంపు అంశం పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా స్టైపెండ్‌ను సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఇతర వైద్య విద్యార్థులకు అందుతున్న స్టైపెండ్‌తో సమానంగా తమకూ పెంచాలని ఆయూష్ హౌస్‌ సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థులు కోరుతున్నారు. స్టైపెండ్‌ పెంపుపై వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తమ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేసే అంశాన్ని కూడా విద్యార్థులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.