ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన లారీ యజమానిపై చర్యలు

మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం పట్టణంలో పీక్ అవర్స్‌లో భారీ లారీని రహదారిపై నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన లారీ యజమానిపై మైలవరం పోలీసులు భారీ జరిమానా విధించారు. భారీ వాహనాలను రహదారులపై నిలిపి సరుకుల లోడింగ్, అన్‌లోడింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీతో పాటు ప్రమాదాల ముప్పు పెరుగుతుందని పోలీసులు తెలిపారు.

ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యం కోసం లోడింగ్, అన్‌లోడింగ్‌ను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని సూచించారు. నిర్దేశిత సమయాలను ఉల్లంఘించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వాహనాలపై భారీ జరిమానాలతో పాటు, అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. లారీ యజమానులు, డ్రైవర్లు, వ్యాపార సంస్థలు నిబంధనలు పాటించి ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.