బొండా ఉమా నాయకత్వంలో టీడీపీకి తిరుగులేని బలం!

  • ఆగస్టు 15న లోకేశ్‌ పర్యటనను విజయవంతం చేయాలి
  • భారీగా ప్రజా సమీకరణకు సెంట్రల్‌ టీడీపీ శ్రేణుల పిలుపు
  • ఓటర్ల జాబితా మార్పులు, చేర్పులు, తొలగింపులపై సమగ్ర సమీక్ష
  • కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం.. ప్రజా సమస్యలపై నిరంతర దృష్టి
  • సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని నిర్ణయం
  • పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రభుత్వ విప్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతోందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆగస్టు 15న విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ విజయవాడ పర్యటనను విజయవంతం చేసేందుకు భారీగా ప్రజా సమీకరణ చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 30వ డివిజన్‌లోని టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నెలవారీ సమావేశంలో పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమస్యలు, ప్రజల నుంచి వస్తున్న వినతులపై సమీక్షించారు.

ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్స్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, క్లస్టర్‌ ఇన్‌చార్జి ఘంటా కృష్ణమోహన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 15న నారా లోకేశ్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

ఓటర్ల జాబితాపై సమీక్ష..

ఎస్‌ఐఆర్‌ ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు, చేర్పులు, తొలగింపులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. డివిజన్‌ స్థాయిలో పార్టీ పరిస్థితి, కార్యకర్తల సమస్యలు, ప్రజల నుంచి అందుతున్న వినతులు, పార్టీ కార్యక్రమాల అమలుపై నాయకులు చర్చించారు. కార్యకర్తలు ప్రస్తావించిన సమస్యల్లో పరిష్కరించగల అంశాలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా నిలవడంతో పాటు వారి సమస్యలకు ప్రాధాన్యమివ్వాలని నాయకులు పేర్కొన్నారు.

ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమం..

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బొండా ఉమామహేశ్వరరావు మార్గదర్శకత్వంలో నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి పార్టీని మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ డివిజన్‌ అధ్యక్షుడు లక్కాంరాజు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి వీరభద్రం, తుపాల వరప్రసాద్‌, వెలగపూడి శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.