హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లో హైడ్రా జోక్యం చేసుకుంటోందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. రంగనాథ్‌కు norma జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
మేడ్చల్‌లోని వాణి కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కూల్చివేతలు చేపడుతున్నారనే అంశంపై హైడ్రా తీరును ప్రశ్నించింది.
కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లో ఇష్టానుసారంగా జోక్యం చేసుకోవడం హైడ్రా కమిషనర్‌కు అలవాటుగా మారిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హైడ్రా చర్యల కారణంగా ఇతర అధికారులు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాల్సి వస్తోందని, దీనివల్ల న్యాయస్థానం విలువైన సమయం వృథా అవుతోందని పేర్కొంది.
ఇప్పటివరకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎన్ని, వాటికి విరుద్ధంగా హైడ్రా ఎన్ని కూల్చివేతలు చేపట్టిందనే వివరాలతో నివేదిక ఇవ్వాలని మేడ్చల్ కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాకు సూచించింది.
