సమన్వయంతో ముందుకు…
- రవి సుభాష్‌కు నూకసాని బాలాజీ శుభాకాంక్షలు
- ఇరువురి మర్యాదపూర్వక భేటీ
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని ఏపీటీడీసీ చైర్మన్ డా. నూకసాని బాలాజీ, నూతన మేనేజింగ్ డైరెక్టర్, ఏపీఏటీఏ సీఈఓ పట్టణెట్టి రవి సుభాష్ ఐఏఎస్ చర్చించారు. విజయవాడలోని ఏపీటీడీసీ చైర్మన్ ఛాంబర్లో బుధవారం రవి సుభాష్ మర్యాదపూర్వకంగా బాలాజీని కలిశారు.
ఇటీవల బదిలీపై ఏపీటీడీసీ ఎండీ, ఏపీఏటీఏ సీఈఓగా నియమితులైన రవి సుభాష్ ఆగస్టు 10న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాలాజీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పర్యాటక మౌలిక వసతుల బలోపేతం, సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ప్రముఖ పర్యాటక కేంద్రాలకు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం కల్పించడం వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీటీడీసీ, ఏపీఏటీఏ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. రవి సుభాష్ నాయకత్వంలో ఏపీటీడీసీ మరింత పురోగతి సాధించి రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని నూకసాని బాలాజీ ఆకాంక్షించారు.
