King 100 | టబుతో మళ్లీ నాగార్జున.. 28 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్
King 100 | టబుతో మళ్లీ నాగార్జున.. 28 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్
King 100 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 100వ సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. తాత్కాలికంగా #King100 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కథానాయికగా నటించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు మళ్లీ పూర్తి స్థాయి జోడీగా ప్రేక్షకుల ముందుకు రానుండటం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
నాగార్జున, టబు కలిసి గతంలో నటించిన చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 1996లో దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘నిన్నే పెళ్లాడతా’ తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్ ప్రేమకథగా నిలిచింది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అప్పడి ప్రేక్షకుల హృదయాల్లో యమ క్రేజీగా నిలిచిపోయింది. అనంతరం 1998లో విడుదలైన ‘ఆవిడ మా ఆవిడే’ చిత్రంలో కూడా ఈ జంట కలిసి నటించింది. అలాగే నాగార్జున తనయుడు అఖిల్ చిన్నప్పటి చిత్రం ‘సిసింద్రి’లో టబు అతిథి పాత్రలో కనిపించింది. ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు మరోసారి ఒకే సినిమాలో కనిపించనుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నాగార్జున 100వ చిత్రానికి తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహించనున్నారు. ఆయన గతంలో తమిళంలో ‘నితమ్ ఒరు వానం’, ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రాలకు దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు. ఇప్పుడు తొలిసారిగా నాగార్జునతో కలిసి తెలుగు చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా కావడంతో కథ, నటీనటుల ఎంపిక, సాంకేతిక విభాగాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలోనే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు టైటిల్, ఇతర నటీనటుల వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన జోడీల్లో నాగార్జున-టబు కాంబినేషన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు అదే జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండటంతో #King100పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
