ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం.. అక్షర్ ఆల్‌రౌండ్ షో !!

  • గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్..
  • భారత్ 1-0 ఆధిక్యం

ఆంధ్రప్రభ, స్పోర్ట్స్ డెస్క్ : ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అదరగొట్టింది. బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ను 258 పరుగులకే కట్టడి చేసిన భారత్.. అనంతరం లక్ష్య ఛేదనలో సమష్టిగా రాణించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 259 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఛేదించి.. విజ‌యాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ సేన 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్..

లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ 21 బంతుల్లో 11 పరుగులు చేసి సామ్ కరన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 300వ వన్డే ఆడుతున్న విరాట్ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. కేవలం 6 బంతుల్లో 5 పరుగులు చేసిన కోహ్లీని జోఫ్రా ఆర్చర్ ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. దీంతో భారత్ 48 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

ఈ దశలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మూడో వికెట్‌కు 101 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. గిల్ 75 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 80 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. శ్రేయస్ అయ్యర్ 53 బంతుల్లో 35 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆ వెంటనే కేఎల్ రాహుల్ ఒక్క పరుగుకే వెనుదిరగడంతో భారత్‌పై మరోసారి ఒత్తిడి పెరిగింది.

సుందర్–అక్షర్ సూపర్ జోడీ..

160 పరుగుల వద్ద కీలక వికెట్లు కోల్పోయిన భారత్‌ను వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ జోడీ విజయతీరాలకు చేర్చింది. ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అజేయంగా 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్ పటేల్ 52 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ 63 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత్ విజయానికి చేరువైన వేళ వాషింగ్టన్ సుందర్ తనదైన శైలిలో మ్యాచ్‌కు ముగింపు పలికాడు. భారీ సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు అదే షాట్‌తో తన అర్ధశతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత శిబిరంలో సంబరాలు మిన్నంటాయి.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ 76 పరుగులతో అజేయంగా నిలవగా, లియామ్ డాసన్ 68 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా, గూర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. బుమ్రా, శివమ్ దూబే చెరో వికెట్ దక్కించుకున్నారు. బంతితో నాలుగు వికెట్లు.. బ్యాట్‌తో అజేయ అర్ధశతకం సాధించిన అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన భారత విజయంలో కీలకంగా నిలిచింది.