ఎడ్జ్‌బాస్టన్‌లో వన్డే సమరం.. రోహిత్, కోహ్లీ వచ్చేశారు.. !!

ఆంధ్రప్రభ : టీ20 సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత ఇంగ్లండ్‌తో వన్డే సమరానికి టీమిండియా సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత్ ముందుగా బౌలింగ్ చేయనుంది.

ఇంగ్లండ్ పర్యటనలో భారత్ తొలిసారి టాస్ ఓడిపోయింది. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని భావించినట్లు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఇదిలా ఉండ‌గా.. వన్డే సిరీస్‌తో భారత సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో తనకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయని, అదే ఫామ్‌ను వన్డేల్లోనూ కొనసాగించాలని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు.

భారత్ జట్టు కూర్పులో కీలక నిర్ణయం తీసుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. బ్యాటింగ్‌లో డెప్త్ పెంచే వ్యూహంతో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేసింది. స్పిన్ బాధ్యతలను వీరిద్దరే పంచుకోనున్నారు. పేస్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రాకు గూర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ అండగా నిలవనున్నారు. శివమ్ దూబేతో కలిపి భారత్‌కు నలుగురు సీమర్లు అందుబాటులో ఉన్నారని గిల్ తెలిపాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు.

బ్యాటింగ్‌కు అనుకూలం.. తర్వాత స్పిన్‌కు ఛాన్స్

టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, భారీ స్కోరు సాధించి రెండో ఇన్నింగ్స్‌లో తమ స్పిన్నర్లతో భారత్‌పై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అయితే పిచ్‌పై గ‌డ్డితోపాటు తేమ కూడా ఉండటంతో తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో పేసర్లకు సహకారం లభించే అవకాశం ఉంది. బుమ్రా నేతృత్వంలోని భారత పేస్ దళం కొత్త బంతితో ఇంగ్లండ్ ఓపెనర్లను ఎంత త్వరగా కట్టడి చేస్తుందన్నది కీలకంగా మారింది.

బట్లర్‌కు 200వ వన్డే

ఈ మ్యాచ్ తో… ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ 200వ వన్డే మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున 200 వన్డేలు ఆడిన రెండో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. ఇయాన్ మోర్గాన్ 225 వన్డేలతో ఈ జాబితాలో ముందున్నాడు. ఇక జోష్ టంగ్ ఈ మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. లియామ్ డాసన్ తన కెరీర్‌లో 50వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు.

వన్డే సిరీస్‌లలో భారత్‌దే పైచేయి..

2011 నుంచి భారత్–ఇంగ్లండ్ మధ్య జరిగిన తొమ్మిది ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లలో భారత్ ఏడు సిరీస్‌లను గెలుచుకుంది. ఇంగ్లండ్ కేవలం రెండింటిలోనే విజయం సాధించింది. అయితే బర్మింగ్‌హామ్‌లో ఆతిథ్య జట్టుకే తిరుగులేని రికార్డు ఉంది. 2015 నుంచి ఇక్కడ ఆడిన ఏడు వన్డేల్లో ఇంగ్లండ్ ఏడింటినీ గెలుచుకుంది. దీంతో నేటి మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

భారత తుది జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, గూర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్.