ఇదే ఆఖ‌రి రోజు స‌ర్‌..

ఎన్యూమ‌రేష‌న్ ఫారాన్ని వెంట‌నే బీఎల్‌వోకు అంద‌జేయండి
ఓటు హక్కు ప్రతి పౌరుని రాజ్యాంగబద్ధమైన హక్కు
ఆ హ‌క్కును భద్రపరచుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత
క్షేత్ర‌స్థాయిలో ఓట‌ర్ల సేవ‌లో ప్ర‌త్యేక అధికారులు
16,35,148 (95.43 శాతం) మంది ఓట‌ర్ల వివ‌రాల డిజిటైజేష‌న్
మీడియా స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్య‌క్ర‌మంలో ఎన్యూమ‌రేష‌న్ ఫారాల స‌మ‌ర్ప‌ణ‌కు నేడు (జూలై 14) ఆఖ‌రి రోజు కావడంతో ఇంకా ఎవ‌రైనా ఫారం స‌మ‌ర్పించ‌క‌పోతే వెంట‌నే బీఎల్‌వోకు అంద‌జేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్‌రెడ్డి హాల్‌లో స‌ర్ ప్ర‌క్రియ‌పై మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అర్హ‌త ఉన్న ఏ ఒక్క ఓట‌రూ జాబితా బ‌య‌ట ఉండ‌కూడ‌దు.. అర్హ‌త‌లేని ఏ ఒక్క రూ ఓట‌రు జాబితాలో ఉండ‌కూడ‌దు.. అనే ల‌క్ష్యంతో స‌ర్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు. మొత్తం 17,13,445 మంది ఓట‌ర్ల‌కుగాను 16,35,148 (95.43 శాతం) మంది ఓట‌ర్ల ఎన్యూమ‌రేష‌న్ ఫారాలు, ప్ర‌స్తుత స్థితి వివ‌రాల‌ను డిజిటైజేష‌న్ లేదా ఆన్‌లైన్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

మ‌ర‌ణించిన‌, శాశ్వ‌తంగా వ‌ల‌స‌వెళ్లిన త‌దిత‌ర ఓట‌ర్ల వివ‌రాల‌ను ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఆన్‌లైన్లో న‌మోదు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో 2,00,374 (96.01 శాతం) ఫారాల డిజిటైజేష‌న్ పూర్త‌యింద‌ని.. ఇదే విధంగా విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో 2,52,759 (98.36 శాతం), విజ‌య‌వాడ మ‌ధ్యలో 2,60,952 (93.93 శాతం), విజ‌య‌వాడ తూర్పులో 2,58,597 (95.87 శాతం), మైల‌వ‌రంలో 2,68,761 (94.25 శాతం), నందిగామ‌లో 1,95,415 (94.18 శాతం), జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో 1,98,290 (95.54 శాతం) డిజిటైజేష‌న్ పూర్త‌యింద‌ని వివ‌రించారు. ఓటు హక్కు ప్రతి పౌరుని రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దాన్ని భద్రపరచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సులభతరం చేయడానికి జిల్లాలో ప్రత్యేక అధికారులు, బీఎల్‌వోలు, బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఏవైనా సందేహాలుంటే బీఎల్‌వోలను సంప్రదించి వెంటనే ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. హెల్ప్ డెస్కుల‌తో పాటు స‌హాయం అందించేందుకు స్వ‌ర్ణ‌గ్రామం, స్వ‌ర్ణ‌వార్డుల సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నార‌ని.. ఈ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.

ఈ నెల 21న ముసాయిదా జాబితా..

ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా ఈ నెల 21వ తేదీన ముసాయిదా జ‌బితాను ప్ర‌చురించ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. ఈ నెల 21 నుంచి ఆగ‌స్టు 20వ తేదీ వ‌ర‌కు క్లెయిమ్‌లు, అబ్జెక్ష‌న్లు స్వీక‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. జులై 21వ తేదీ నుంచి సెప్టెంబ‌ర్ 18వ తేదీ వ‌ర‌కు నోటీసుల ద‌శ ఉంటుంద‌ని, ఈ స‌మ‌యంలోనే క్లెయిమ్‌లు, అభ్యంత‌రాల‌ను ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. చివ‌రిగా సెప్టెంబ‌ర్ 22వ తేదీన తుది ఓట‌ర్ల జాబితాను ప్ర‌చురించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివ‌రించారు.