రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా:

మండల వ్యవసాయ అధికారి నరేంద్రబాబు

శావల్యాపురం, ఆంధ్రప్రభ : రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తానని శావల్యాపురం మండల నూతన వ్యవసాయ అధికారి వల్లంరెడ్డి నరేంద్రబాబు తెలిపారు.

మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో సోమవారం ఆయన నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న ఆయన బదిలీపై శావల్యాపురం మండలానికి వచ్చారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జి వ్యవసాయ అధికారిగా పనిచేసిన రామినేని రామారావు ఇకపై ఈపూరు మండలానికి పరిమితమయ్యారు.

ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ, రైతులు పండించే పంటలకు అవసరమైన ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

రైతులు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, శాస్త్రీయ సాగు విధానాలపై అవగాహన కల్పిస్తూ రైతుల ఆదాయం పెరిగేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.