ఈశ్వరమ్మ యాదవ్‌పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి: డేగల పాండు యాదవ్

వలిగొండ, ఆంధ్రప్రభ : శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని యాదవ సంఘం జిల్లా నాయకుడు డేగల పాండు యాదవ్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక మహిళపై, అలాగే యాదవ సమాజాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవని అన్నారు. ఈశ్వరమ్మ యాదవ్‌కు, యాదవ సమాజానికి జక్కిడి శివచరణ్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యాదవ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని డేగల పాండు యాదవ్ హెచ్చరించారు.