Bahrain | తెలంగాణ వాసి మృతి…
Bahrain | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బహ్రెయిన్‌లో తెలంగాణకు చెందిన ఓ ప్రవాస భారతీయుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందడం విషాదాన్ని నింపింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ తోట బహ్రెయిన్‌లోని దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
శ్రీనివాస్ తోట 2019 నవంబర్ 26 నుంచి బహ్రెయిన్‌లోని మొహమ్మద్ అహ్మదీ కంపెనీ (MAC)లో ప్రాజెక్ట్స్ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.
ఘటన అనంతరం సంబంధిత అధికారులు చట్టపరమైన, పరిపాలనా ప్రక్రియలను ప్రారంభించారు. శ్రీనివాస్ మృతిపై MAC సంస్థ యాజమాన్యం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది.
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ వాసి అనుకోని ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, సంస్థ యాజమాన్యం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
