విభిన్న ప్రతిభావంతునికి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అందజేసిన ఎమ్మెల్యే..

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడికి చెందిన విభిన్న ప్రతిభావంతులు నల్లబోతు కైలాష్‌కు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సోమవారం చేయూతనందించారు. గొల్లపూడిలోని శాసనసభ్యుని కార్యాలయంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను వితరణగా అందజేశారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో జీవించి అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తనకు ఎంతో అవసరమైన ఈ వాహనం అందించడంపై కైలాష్ హర్షం వ్యక్తం చేశాడు.

ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అందడంతో తన రోజువారీ ప్రయాణం సులభతరం అవుతుందని కైలాష్ ఆనందం వ్యక్తం చేశారు. తన పట్ల ఎంతో ఉదారత చూపి వాహనాన్ని అందించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.