వర్షాల కారణంగా ఖమ్మంలో సీఎం సభ రద్దు..
శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ: రైతు భరోసా పంపిణీ కోసం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఈ నెల 30న జరగాల్సిన ‘రైతు ఆశీర్వాద సభ’ భారీ వర్షాల కారణంగా రద్దయింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాధపురం వద్ద సభ నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సభా ప్రాంగణంలో నీరు నిలిచిపోయి, టెంట్లు కూలిపోయాయి. ఈ సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని రైతు భరోసా పథకం పంపిణీని ప్రారంభించాల్సి ఉంది.
సభ రద్దయిన నేపథ్యంలో, రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. దీనికి సంబంధించి తక్షణమే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం రేపు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు తమ తమ పరిధిలోని రైతు వేదికల ద్వారా డిజిటల్ పద్ధతిలో ఈ సమావేశంలో పాల్గొంటారు.
