నాన్ స్టాప్ సైకిల్ రేసింగ్ విజేత అబ్దుల్ రజాక్
వెల్దండ, ఆంధ్రప్రభ: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ధ్యాప గోపాల్ రెడ్డి శతజయంతి సందర్భంగా గోపాల్ రెడ్డి ట్రస్టు, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాన్ స్టాప్ సైకిల్ రేసింగ్ లో రాచూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ రజాక్ విజేతగా నిలిచారు. ఆదివారం కల్వకుర్తిలోని బి.ఎస్.ఎన్.ఎల్. ప్రాంగణంలో ఈ పోటీలను ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, పోతుగంటి రాములు, గోలి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
దాదాపు 130 మంది పాల్గొన్న ఈ పోటీలో అబ్దుల్ రజాక్ ఉదయం 8:45 నుండి రాత్రి 1:00 గంటల వరకు (16 గంటల పాటు) ఆగకుండా సైకిల్ తొక్కి విజయం సాధించారు. ఫౌండేషన్ నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించి బహుమతి అందజేయగా, నియోజకవర్గ స్థాయిలో గ్రామం పేరు నిలబెట్టినందుకు రాచూర్ గ్రామస్తులు రజాక్‌ను అభినందించారు.
