Voter List Revision Husnabad | ప్రతి ఓటును కాపాడుకోవాలి

Voter List Revision Husnabad | ప్రతి ఓటును కాపాడుకోవాలి

ఓటరు సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు..
బీఎల్‌వోలు అందించే ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచన
హుస్నాబాద్‌లో సుమారు 60 వేల ‘తటస్థ’ ఓట్లు..
అవగాహనతో ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపు

Voter List Revision Husnabad | హుస్నాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి అర్హ ఓటరు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సూచించారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో ఆయ‌న మాట్లాడుతూ.. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ అందిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా నింపి, అవసరమైన ఆధారాలను సమర్పించడం ద్వారా ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరుతున్నారు.

2002, 2025 ఓటరు జాబితాల పరిశీలనలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో సుమారు 60 వేల ఓట్లు ‘తటస్థ’ (న్యూట్రల్) విభాగంలో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి ఓట్లు ఈ విభాగంలో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ‘తటస్థ’గా ఉండటం అంటే ఓటు తొలగిపోయిందని కాదు. సంబంధిత ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి, అవసరమైన గుర్తింపు, చిరునామా ఆధారాలను సమర్పిస్తే వారి ఓటు జాబితాలో కొనసాగుతుందని వివరించారు.

జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్) విడుదల కానున్న నేపథ్యంలో ప్రతి అర్హ ఓటరు తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన సవరణలు చేయించుకోవాలని సూచించారు. ఒక అర్హ ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు, ప్రజల చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధమని పేర్కొంటూ, ప్రతి ఓటును పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు గ్రామాలు, వార్డుల్లో ఓటరు సవరణ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ, ఫారాలు నింపించడంలో సహకరిస్తున్నారు.