Rythu Ashirvada Sabha | నేడు ‘రైతు ఆశీర్వాద సభ’పై తుది నిర్ణయం
Rythu Ashirvada Sabha | నేడు ‘రైతు ఆశీర్వాద సభ’పై తుది నిర్ణయం
మత్కెపల్లి సభా ప్రాంగణం బురదమయం
టెంట్లు కూలిపోవడంతో రైతు మేళా రద్దు..
సీఎం రేవంత్ రెడ్డి సభపై సోమవారం స్థల పరిశీలన అనంతరం నిర్ణయం
Rythu Ashirvada Sabha | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కెపల్లి-జగన్నాథపురం క్రాస్‌రోడ్డు వద్ద నిర్వహించాల్సిన రైతు మేళాను జిల్లా యంత్రాంగం రద్దు చేసింది. సభా ప్రాంగణంలో భారీగా నీరు నిలిచి బురద ఏర్పడటంతో పాటు, గాలులు, వర్షాలకు ఏర్పాటు చేసిన టెంట్లలో కొన్ని కూలిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 30న హాజరుకానున్న ‘రైతు ఆశీర్వాద సభ’ నిర్వహణపై మాత్రం సోమవారం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం దాదాపు గంటపాటు కురిసిన భారీ వర్షానికి సభా ప్రాంగణం పూర్తిగా నీటితో నిండిపోయి బురదమయంగా మారింది. రైతు మేళా కోసం ఏర్పాటు చేసిన సుమారు 150 స్టాళ్లలో కొన్ని బలమైన గాలులకు దెబ్బతిన్నాయి. వాస్తవానికి రెండు రోజుల పాటు రైతు మేళా నిర్వహించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. అయితే గత శుక్రవారం కురిసిన వర్షాలతో ప్రాంగణం చిత్తడిగా మారడంతో తొలి రోజు కార్యక్రమాన్ని రద్దు చేశారు. అనంతరం సోమవారం మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతుండగా మరోసారి భారీ వర్షం కురవడంతో కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది.
సోమవారం సభా ప్రాంగణాన్ని జిల్లా అధికారులు పరిశీలించి పరిస్థితులను అంచనా వేసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న రైతు ఆశీర్వాద సభ నిర్వహణపై తుది నిర్ణయం ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
