సెలవు రోజుల్లో పిల్లలను గమనిస్తూ ఉండాలి

చెల్లిని కాపాడి అన్న మృతి చెందిన హృదయ విదారక ఘటన
19వ డివిజన్‌ పకీరుగూడెంలో నీట మునిగి మరణించిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌..
కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

ఆంధ్రప్రభ కృష్ణలంక : విద్యాసంస్థలకు సెలవు రోజల్లో పిల్లలు ఎక్కడకు వెళుతున్నారు, వారు ఏమీ చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. పకీరుగూడెంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్‌ పకీరూగూడెంలో మహమ్మద్‌ సబీర్‌ అనే బాలుడు ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించాడు.

ఈ విషయాన్ని తెల్సుకున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ వెంటనే స్పందించి సబీర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా సబీర్‌ తన చెల్లితో కలిసి కాలువలో చేపల వేటకు వెళ్ళాడని, నీటిలో చెల్లి పడిపోవడంతో ఆమెను కాపాడి సబీర్‌ నీట మునిగి చనిపోవడం దురదృష్టకరమన్నారు.

నీటిలో మునిగిపోతున్న చెల్లిని కాపాడి అన్న మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు. సెలవు రోజుల్లో పిల్లలు ఎక్కడి వెళుతున్నారు, ఏ విధమైన ఆటలు ఆడుతున్నారనే విషయాలన్ని తల్లిదండ్రులు పరిశీలిస్తూ ఉండాలని చెప్పారు. ప్రమాదానికి కారణం అయిన కాలువ దగ్గర రక్షణ తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక పార్టీ నాయకులు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ వెంట ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగం సాయిప్రసాద్, ఎస్.కె కలాం,
ఎండి జలీల్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.