పాలనలో హుందాతనం..
మమకారంలో మాతృత్వం..
ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ ప్రతిమా సింగ్
తన కుమార్తెలకు పోలియో చుక్కలు వేయించి..
ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు పిలుపు
మెదక్, ఆంధ్రప్రభ: ఒకవైపు జిల్లా కలెక్టర్‌గా ప్రజారోగ్యంపై అవగాహన కల్పిస్తూ, మరోవైపు తల్లిగా తన కుమార్తెలకు పోలియో చుక్కలు వేయించి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదర్శంగా నిలిచారు. ప్రజలకు సూచనలు చేయడమే కాకుండా, వాటిని స్వయంగా ఆచరించి పోలియో చుక్కల ప్రాముఖ్యతను చాటిచెప్పారు.
ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు తమ 10 నెలల కుమార్తెలు ఏకాంషి, అద్వితలకు పోలియో చుక్కలు వేయించారు.
అంతకుముందు మెదక్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి, 0 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.
ఇటు తల్లిగా, అటు జిల్లా కలెక్టర్‌గా రెండు బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ప్రతిమా సింగ్, ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.
