“మేడ్ ఇన్ జొన్నగిరి”…

ఇప్పుడు భారత పసిడికి కొత్త చిరునామా..!

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఒకప్పుడు భారతదేశంలో బంగారం అంటే కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) గుర్తుకొచ్చేది. కేజీఎఫ్ మూతపడిన తర్వాత దేశీయ బంగారం ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా జొన్నగిరి భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్‌గా జొన్నగిరి జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఇకపై భారత పసిడిపై మేడిన్ జొన్నగిరి అని ముద్ర పడబోతోంది. అయితే… ఇక్కడే బంగారం ఉత్పత్తి అవుతోంది కాబట్టి చౌకగా దొరుకుతుందా? సమాధానం మాత్రం లేదు.

జొన్నగిరిలో వెలికితీసిన బంగారం ధరను నిర్ణయించేది గని కాదు… అంతర్జాతీయ బులియన్ మార్కెట్. లండన్ బులియన్ మార్కెట్, దేశీయ ఎంసీఎక్స్ ధరల ఆధారంగానే విక్రయాలు జరుగుతాయి. అందుకే జొన్నగిరిలోనూ, హైదరాబాద్‌లోనూ, దేశంలోని ఇతర నగరాల్లోనూ బంగారం ధర దాదాపు ఒకేలా ఉంటుంది.

దేశీయంగా బంగారం ఉత్పత్తి కావడంతో దిగుమతి సుంకం వర్తించదు. అయితే ఆ ప్రయోజనం వినియోగదారుడికి కాకుండా మైనింగ్ సంస్థకే ఉంటుంది. అలాగే జొన్నగిరిలో తయారయ్యే గోల్డ్ బార్లను నేరుగా ప్రజలకు విక్రయించరు. బ్యాంకులు, బులియన్ డీలర్లు, ప్రముఖ జువెలరీ సంస్థలకు మాత్రమే హోల్‌సేల్‌గా సరఫరా చేస్తారు.ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి మాత్రం భారీ ప్రయోజనాలు ఉన్నాయి. బంగారం విలువపై 4 శాతం రాయల్టీ, తొలి ఏడాదిలోనే సుమారు రూ.57 కోట్ల ఆదాయం, 700 మందికి ప్రత్యక్ష ఉపాధి, వందలాది మందికి పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి, కొత్త పెట్టుబడులకు కూడా ఈ ప్రాజెక్టు బాటలు వేయనుంది.

మొత్తానికి… ” మేడిన్ జొన్నగిరి” అనేది కేవలం ఒక గోల్డ్ మైన్ పేరు కాదు… కేజీఎఫ్ తర్వాత భారత పసిడి రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను జాతీయస్థాయిలో నిలబెట్టే కొత్త గుర్తింపు. బంగారం ధరలు తగ్గకపోయినా… దేశీయ బంగారం ఉత్పత్తికి, రాష్ట్ర ఆదాయానికి, స్థానిక ఉపాధికి జొన్నగిరి బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతోంది.