అటవీ భూముల పరిరక్షణకు గిరిజనుల సహకారం అవసరం
- ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వికాస్
దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ శాఖ కార్యాలయంలో మంగళవారం కోయపోషగూడ గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అటవీ భూముల పరిరక్షణ, వినియోగం, అటవీ సంపద అభివృద్ధి అంశాలపై ఆదివాసీ గిరిజన నాయకులతో అధికారులు చర్చించారు.
ఈ సందర్భంగా తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వికాస్ మాట్లాడుతూ అటవీ భూములు ఆక్రమణలకు గురికాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అటవీ సంపద పరిరక్షణలో స్థానిక గిరిజనుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
అటవీ శాఖ సూచనలపై స్పందించిన కోయపోషగూడ గ్రామస్తులు, గిరిజన నాయకులు సానుకూలంగా స్పందించారు. అయితే తమపై నమోదైన కేసులను అటవీ శాఖ ఉపసంహరించుకుంటేనే అటవీ భూముల్లో వెదురు మొక్కల పెంపక కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని స్పష్టం చేశారు.
వెదురు మొక్కల పెంపకం ద్వారా అడవుల అభివృద్ధితో పాటు గిరిజనులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాము, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాజేందర్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, కోయపోషగూడ గ్రామస్తులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.
