ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

  • జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణుతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

వాంకిడి మండలం వెల్గి గ్రామానికి చెందిన జుగునాక బాదిరావు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. సిర్పూర్ మండల కేంద్రానికి చెందిన జువెల్ల హుస్సేన్ తనకు స్వాతంత్ర్య సమరయోధుడి ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.

కౌటాల మండలం వీర్దండి గ్రామ మాజీ సర్పంచ్ తన పదవీకాలంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని కోరగా, అదే మండలంలోని మొగడ్ దగడ్ గ్రామానికి చెందిన ఎర్మ సుధాకర్ తన ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూమికి సోలార్ కనెక్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన రౌతు విర్ధు తన పట్టా భూమిలో ఇతరులు అక్రమంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లింగాపూర్ మండలం ఖిమనాయక్ తండాకు చెందిన తేజావత్ సంగీత ఆశా వర్కర్ పోస్టు మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.

బెజ్జూరు మండలం సల్గుపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి లింగయ్య తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందున సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరగా, ఆసిఫాబాద్ మండలం గోడవెల్లి గ్రామానికి చెందిన ఘాజిరెడ్డి కార్తీక్ దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల సమస్యలను త్వరగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.