ప్రజలు ఎస్ఐఆర్‌కు సహకరించాలి

ప్రజలు ఎస్ఐఆర్‌కు సహకరించాలి

ఇంటింటి సర్వేలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ

రాప్తాడు, ఆంధ్రప్రభ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026 కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, మండల తహసీల్దార్ చెన్నకేశవులు తెలిపారు.

గురువారం 155-రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జి.కొత్తపల్లి గ్రామంలో బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, రాప్తాడు మండలంలో 35,820 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. జూలై 14 వరకు నిర్వహించే బూత్ స్థాయి అధికారుల ఇంటింటి సందర్శన ప్రక్రియ పూర్తయ్యే వరకు, అలాగే బీఎల్ఓలు లాగిన్‌లో వివరాల డిజిటలైజేషన్ పూర్తి చేసే వరకు ప్రజలు తప్పనిసరిగా వారికి అందుబాటులో ఉండాలని సూచించారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. గ్రామాల్లో ఎలాంటి అపోహలు, సమస్యలు తలెత్తకుండా ప్రజలు తమ సందేహాలు, సమస్యలను మండల స్థాయి అధికారులు, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

బీఎల్ఓలతో వాదోపవాదాలకు దిగకుండా వారికి అవసరమైన సహకారం అందించాలని తహసీల్దార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఎల్ఓ ఉపేంద్ర, వైసీపీ నాయకుడు తాతిరెడ్డి, టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి సి. నారాయణస్వామి, జి. కొండారెడ్డి, తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.