private schools fees Telangana | నగరాల్లో ఆకాశాన్ని తాకుతున్న ఫీజులు
private schools fees Telangana | నగరాల్లో ఆకాశాన్ని తాకుతున్న ఫీజులు
private schools fees Telangana | ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల భారీ పెంపు
పుస్తకాలు–యూనిఫామ్ పేరుతో అదనపు వసూళ్లు
జిల్లాల్లోనూ కొనసాగుతున్న దోపిడీ
ఫీజు నియంత్రణ చట్టం అమలుపై నిర్లక్ష్యం
తల్లిదండ్రుల ఆగ్రహం మరియు ప్రభుత్వంపై డిమాండ్
private schools fees Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. ఫీజులను 20 నుంచి 3000 శాతం వరకు పెంచేశాయి. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఈ పెంపు ఏకంగా 40 శాతానికి పైగా ఉండటం గమనార్హం. జూన్ మొదటి వారం నుంచే అడ్మిషన్ల పేరుతో, పాత బకాయిల పేరుతో తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మరీ ఫీజులు గుంజుతున్నాయి.
రాష్ట్రంలో సుమారు 13 వేల ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, దాదాపు 45 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ఈ ఫీజుల కోరల్లో చిక్కుకుంది. కేవలం ట్యూషన్ ఫీజు పెంచడమే కాకుండా, ప్రైవేట్ స్కూళ్లు ఒక సిండికేట్‌గా ఏర్పడి అదనపు దోపిడీకి తెరలేపాయి. పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్, షూస్ ధరలపై 10 నుంచి 15 శాతం వరకు పెంచారు.
ఈ వస్తువులను కచ్చితంగా పాఠశాలలోనే లేదా వారు సూచించిన దుకాణాల్లోనే కొనాలనే కఠిన నిబంధనలు విధిస్తున్నారు. బయట మార్కెట్లో తక్కువ ధరకు లభించే వస్తువులను స్కూల్ లోగో వేసి రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారు. గతేడాది కంటే ఇప్పుడు ఏకంగా 50 శాతం పెంచేశారని తల్లిదండ్రులు వాపోతున్నారు.
అందనంత ఎత్తులో ఫీజులు
నగరంలోని సుమారు 120కి పైగా టాప్ పాఠశాలలు సామాన్యుడు కలలో కూడా ఊహించని విధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతర్జాతీయ స్కూళ్లలో అయితే నర్సరీ చదవడానికే రూ. 2.51 లక్షల నుంచి రూ. 3 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
సీబీఎస్ఈ స్కూళ్లు ఏడాదికి రూ. 2.61 లక్షల నుంచి రూ. 4.91 లక్షల వరకు ఫీజులు గుంజుతున్నాయి. ఈ భారీ ఫీజులు కాకుండా లంచ్, స్నాక్స్, ట్రాన్స్పోర్ట్ చార్జీల పేరుతో మరో రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు అదనంగా బాదుతున్నారు.
షేక్‌పేట, గచ్చిబౌలి ప్రాంతాల్లోని స్కూళ్లలో నర్సరీ నుంచి యూకేజీ వరకు ట్యూషన్ ఫీజు రూ. 71,800 ఉండగా, పై తరగతులకు అది రూ. 1.25 లక్షలు దాటుతోంది. ఉప్పల్‌లోని ఒక స్కూల్ గతేడాది రూ. 76 వేలు ఉన్న ఫీజును ఈసారి ఏకంగా రూ. లక్షకు పెంచేసింది.
జిల్లాల్లోనూ అదే పరిస్థితి
ఫీజుల బాదుడు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. జిల్లా కేంద్రాల్లోని స్కూళ్లు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్నపాటి ప్రైవేట్ స్కూళ్లు కూడా దోపిడీకి పాల్పడుతున్నాయి.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఒక పాఠశాలలో ఎల్కేజీ ఫీజు రూ. 40 వేల నుంచి రూ. 43,500కు పెరిగింది. మరో స్కూల్లో ఎల్‌కేజీకే రూ. 45 వేలు వసూలు చేస్తూ, పుస్తకాల కోసం అదనంగా రూ. 10 వేలు తీసుకుంటున్నారు.
ఖమ్మంలో ఒక కార్పొరేట్ స్కూల్ 8వ తరగతి ఫీజును రూ. 42 వేల నుంచి రూ. 56 వేలకు పెంచింది. రెండు జతల యూనిఫామ్ కోసం గతేడాది రూ. 4,800 తీసుకుంటే, ఇప్పుడు రూ. 6,800 వసూలు చేస్తున్నారు.
అటకెక్కిన ఫీజు నియంత్రణ చట్టం
ఏటా ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ, దానిపై స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. ఫిబ్రవరిలోనే రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి, నిబంధనలు అతిక్రమించే స్కూళ్ల గుర్తింపు రద్దు చేస్తామని, ఫిర్యాదుల కోసం ప్రత్యేక పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఆ పోర్టల్ అందుబాటులో లేదు, అధికారుల పర్యవేక్షణ కూడా లేదు.
దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ ఫీజుల విషయంలో కీలక సూచనలు చేసింది. రెండేళ్లకోసారి కేవలం 8 శాతం మాత్రమే ఫీజు పెంచుకోవాలని, 9 శాతం దాటితే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని సూచించింది. ఈ సిఫార్సులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో యాజమాన్యాలకు అడ్డులేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు ప్రభుత్వం నెల రోజుల్లోనే ఫీజు నియంత్రణ సవరణ బిల్లును తెచ్చిందని, మన రాష్ట్రంలో కూడా ఇలాంటి పటిష్టమైన చట్టం తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
