ఏఐసీసీలో భారీ మార్పులు.. తెలంగాణ నుంచి ఇద్దరికి కీలక బాధ్యతలు?
ఏఐసీసీలో భారీ మార్పులు.. తెలంగాణ నుంచి ఇద్దరికి కీలక బాధ్యతలు?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రక్షాళన వ్యూహం
తెలంగాణ మంత్రులకు ఏఐసీసీలో కీలక పదవులు?
మీనాక్షి నటరాజన్ మార్పుపై అంతర్గత చర్చలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలో అధికారమే లక్ష్యంగా ఏఐసీసీ అధినాయకత్వం పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించేలా వ్యూహరచన సాగుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు ఇంచార్జిలుగా బలమైన నాయకులను నియమించాలని పార్టీ పెద్దలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న ఇద్దరు మంత్రుల సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మంత్రులను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించి వారికి ఆయా రాష్ట్రాల ఇంచార్జ్ బాధ్యతలను కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్టు సంకేతాలు వస్తున్నాయి.
ఇద్దరు మంత్రుల్లో ఒకరు ఉత్తర తెలంగాణ నుంచి, మరొకరు దక్షిణ తెలంగాణకు చెందిన వారని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రికి మహారాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను అప్పగించే యోచనలో పార్టీ పెద్దలున్నట్టు చెబుతున్నారు. పార్టీ ప్రక్షాళనకు సంబంధించి ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇండియా కూటమి ఉన్నత స్థాయి సమావేశం లోపు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మీనాక్షి నటరాజన్‌ను మార్చే అవకాశం
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను చక్కబెడుతున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్‌ను కూడా మార్చే అవకాశం లేకపోలేదని ఏఐసీసీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమెను తెలంగాణ నుంచి తప్పించి అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట నియమించే అవకాశం ఉందని లేదా ఢిల్లీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో రాబోయే ఎన్నికల కోసం ఇప్పటినుంచే సన్నద్ధత అవసరమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించి ఉత్సాహాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతోంది. జాతీయ నాయకత్వంలో భారీ స్థాయిలో మార్పులు జరిగితే తెలంగాణకు చెందిన మరికొంత మంది నేతలకు కూడా ఏఐసీసీలో చోటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.
